కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్ ప్రచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు విఫలయత్నం చేస్తోంది. విశాఖపట్నం జిల్లా మారికవలసలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను మూసివేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారమంతా పూర్తిగా ఫేక్ అని మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధినీ, విద్యా రంగంలో వస్తున్న మార్పులను ఓర్వలేక వైసీపీ నాయకులు ఇలాంటి ఫేక్ ప్రచారాలతో కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మారికవలస పాఠశాలను మూసివేయడం లేదని, గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అక్కడ ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని స్పష్టమైంది. గిరిజన విద్యార్థులకు మరింత మెరుగైన విద్యతో పాటు, ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు లభించేలా తీర్చిదిద్దడమే ఈ సెంటర్ ఏర్పాటు వెనుక ఉన్న ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ మార్పు జరిగే క్రమంలో విద్యార్థుల చదువుకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ, కేవలం రాజకీయ లబ్ధి కోసమే దీనిపై వివాదం సృష్టించాలని వైసీపీ నేతలు చూశారు.
ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్, వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పింది. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను దూరం చేస్తున్నారంటూ కొందరు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరింది. ఇప్పటికే మారికవలస పాఠశాలకు చెందిన 400 మంది విద్యార్థులను సురక్షితంగా వివిధ గిరిజన పాఠశాలలకు కేటాయించగా, విద్యార్థుల నుంచి ఎలాంటి ప్రతిఘటన రాలేదని, వారు ఎంతో సంతృప్తితో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి విద్యార్థుల్ని తిరిగి మారికవలసలోని స్కూల్‌కు తరలించడంతో పాటు, స్కూల్‌ను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ వివాదానికి పూర్తిగా తెరపడింది.
గిరిజన విద్యార్థుల విద్యా సౌకర్యాలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, కానీ ఓర్వలేక వైసీపీ ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని ఫ్యాక్ట్ చెక్ టీమ్ హితవు పలికింది. విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం మానుకోవాలని సూచిస్తూ, ప్రభుత్వ సంస్కరణలను అడ్డుకోవాలని చూసే వారి కుట్రలను ప్రజలు గమనించాలని కోరింది.











