కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న నిరసన 12వ రోజుకు చేరింది. కేంద్రంతో 34 రైతు సంఘాలు జరిపిన చర్చలు ఐదో విడత చర్చలు విఫలం కావడంతో 8వ తేదీన భారత్ బంద్ కు పిలుపు నిచ్చారు. రైతు సంఘాల భారత్ బంద్ పిలుపునకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ కు మద్దతు తెలిపింది. ఇక శివసేన, టీఆర్ఎస్, అకాలీదళ్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు కూడా 8వ తేదీ భారత్ బంద్ కు మద్దతు పలికారు. ఇప్పటికే రైతుల నిరసనకు మద్దతుగా లారీ ఓనర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు పలికింది.
చట్టాలు రద్దు చేస్తేనే వెనక్కు తగ్గుతాం
నూతనంగా తీసుకు వచ్చిన చట్టాలను పూర్తిగా రద్దు చేస్తేనే ఢిల్లీని వదలి వెళ్లిపోతామని లేదంటే సంవత్సరంపాటైనా పోరాడటానికి సిద్దంగా ఉన్నామని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. దీంతో చట్టాల్లో సవరణలు చేస్తే సరిపోతుందనుకున్న కేంద్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. చట్టాలను రద్దు చేయాలంటే మరలా అత్యవసరంగా పార్లమెంటును సమావేశ పరచాల్సి ఉంది. దీనిపై కేంద్రం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది. అప్పటి వరకు 3 లక్షల మంది రైతులు ఢిల్లీ నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. ఢిల్లీలో రైతులు మకాం వేయడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా కీలక రహదారులను మూసివేశారు. దీంతో ఢిల్లీ వాసులకు ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి.
వివాదాస్పద చట్టాలు చర్చలేకుండా ఎలా తీసుకువచ్చారు
ఇంతటి వివాదాస్పద చట్టాలను కరోనా సమయంలో సభలో చర్చకూడా చేపట్టకుండా హడావుడిగా తీసుకురావడంపై రైతు సంఘాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో 50 కోట్ల మంది రైతులకు మద్దతు ధర దక్కడం లేదని, ఇక కొత్త చట్టాలు అమల్లోకి వస్తే కనీస మద్దతు ధర కూడా దక్కేది కష్టమేనని రైతులు ఆందోళనలో ఉన్నారు. నూతన చట్టాల వల్ల కార్పొరేట్, ఒప్పందం వ్యవసాయం మొదలై, రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందని కూడా రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రైవేటు కంపెనీలు మద్దతు ధరను పరిగణనలోకి తీసుకుంటాయా? నూతన చట్టం అమల్లోకి వస్తే అసలు రైతుకు కనీస మద్దతు ధర దక్కుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే చట్టాల్లో సవరణలకు కూడా మేము అంగీకరించేది లేదని, చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని 34 రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎవరి వాదన వారిది
కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ చట్టాల వల్ల వారి ఆదాయం రెట్టింపు అవుతుందని చెబుతోంది. రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకునే వీలు కలుగుతుందని కేంద్రం ప్రకటించింది. రైతుల్లో నేటికీ చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారు. సమీపంలోని మార్కెట్లో అమ్ముకుంటేనే ఆ రైతుకు డబ్బు చెల్లించేందుకు నెలల తరబడి తిప్పుతున్నారు. రైతులు రాష్ట్రాలనుదాటి సరకు తీసుకువెళ్లి ఎలా అమ్ముకోగలరు. మరలా అక్కడ కూడా దళారులు రైతుల వేషం వేస్తారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, ధర ఎక్కువ లభించే మార్కెట్లలో సరకు అమ్ముకునే ప్రమాదం ఉంది. ఇక సరకు నిల్వ విషయంలో 1955 నిత్యావసర సరకుల చట్టం అమల్లో ఉంది. నూతన వ్యవసాయ చట్టాలు అమల్లోకి వస్తే ఇక 1955 నిత్యావసర సరకుల చట్టానికి కాలం చెల్లిపోతుంది. ప్రైవేటు వ్యక్తులకు ఎంత పంటైనా గిడ్డంగుల్లో నిల్వ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇదే జరిగితే రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పంటలను కొనుగోలు చేసి, వాటిని గిడ్డంగుల్లో నిల్వ చేసుకుని మార్కెట్లో సరకుల కొరత సృష్టించి ధరలు భారీగా పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేవలం 50 కోట్ల మంది రైతులే కాదు, పేదలు, మద్యతరగతి ప్రజలంతా ధరలు భారం భరించలేక ఆహార కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
విదేశాల నుంచి పెరుగుతోన్న మద్దతు
ఢిల్లీలో 3 లక్షల మంది రైతులు శాంతియుతంగా చేస్తోన్న నిరసన కార్యక్రమానికి కెనడా ప్రధాని మద్దతు పలికారు. మా దేశ విధానాల్లో జోక్యాన్ని సహించమని భారత ప్రధాని మోడీ చెప్పినా, రెండోసారి కెనడా ప్రధాని రైతుల నిరసనకు మద్దతుగా నిలిచారు. ఐక్యరాజ్యసమితిలోని కొందరు ఉన్నత అధికారులు కూడా ఢిల్లీ రైతుల నిరసనకు మద్దతు పలికారు.
దక్షిణాది రైతులకు సంబంధం లేదా?
ఉత్తరాది రాష్ట్రాల రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల రైతులు, రైతు సంఘాలు నోరు విప్పడం లేదు. ఏవో చిన్నచిన్న నిరసన కార్యక్రమాలు తెలిపి దుకాణం మూసేస్తున్నారు. ఉత్తరాది రైతులకు తీవ్ర నష్టం చేకూర్చే చట్టాలు దక్షిణాది రైతుకు మాత్రం నష్టం చేయదా? అనే అనుమానం వస్తోంది. దక్షిణాదిలో పార్టీల వారీగా రైతులు విడిపోయి ఉండటంతో రైతులు సంఘటితం కాలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ బీజేపీతో వ్యతిరేకతతో ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతు తెలిపినట్టు కనిపిస్తోంది. ఇక ఏపీ సీఎం దీనిపై ఒక్కమాట కూడా మాట్లాడలేదు. జనసేనాని బీజేపీతో జట్టుకట్టారు కాబట్టి నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని చెబుతున్నారు. ఇన్ని వైరుధ్యాలు ఉంటే ఇక రైతులు సంఘటితం కావడం ఎలా సాధ్యం అవుతుంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయపార్టీల చేతుల్లో రైతు సంఘాలు ఇరుక్కుపోయాయని భావించవచ్చు. రైతు సంఘాలు స్వతంత్రంగా ఉంటే రైతుల ప్రయోజనాలపై పోరాడే అవకాశం దక్కుతుంది. లేదంటే పార్టీలు తీసుకునే నిర్ణయాలే రైతు సంఘాల నిర్ణయాలుగా చలామణి అవుతూ ఉంటాయి.
Also Read: మా అభివృద్ధి ఇదే.. ఫోటోలపై టీఆర్ఎస్ ప్రచారం