వడ్డే శోభనాద్రీశ్వరరావు… ఈ పేరు వింటే చాలా మందికి ఓ మాజీ మంత్రి గుర్తుకు వస్తారు. మరికొందరికి అభ్యుదయవాది గుర్తుకు వస్తారు. వీటన్నింటికి మించి రైతు సంఘం నాయకుడు మన కళ్ల ముందు కదలాడతారు. రైతుకు కష్టమొస్తే… ఎంతదాకా అయినా సరే అన్న రీతిలో దూసుకుపోయే వడ్డే.. ఇప్పుడు ఢిల్లీని చుట్టుముట్టిన అన్నదాతలకు మద్దతుగా నిలిచారు. వారి ఉద్యమానికి తన వంతుగా రూ.10 లక్షలను సేకరించి అందజేశారు. అంతేనా… 35 రోజులుగా కొనసాగుతున్న రైతు ఉద్యమంలో మోదీ సర్కారు తీరుపై ఘాటు విమర్శలు గుప్పించిన వడ్డే… అసలు మోదీ చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి? భవిష్యత్తులో మోదీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? అన్న విషయాలపై తనదైన మార్కు విశ్లేషణను వినిపించారు. వడ్డే ప్రసంగంతో ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసిన రైతుల్లో మరింత సమరోత్సాహం వచ్చిందని చెప్పక తప్పదు.
కర్ర సాయం లేనిదే నిలబడ లేకున్నా..
కృష్ణా జిల్లా ఉయ్యూరులో నివాసం ఉండే వడ్డే శోభనాద్రీశ్వరరావు వయస్సు ప్రస్తుతం 77 ఏళ్లు దాటిపోయింది. వృద్ధ్యాప్యంతో శరీరంలో శక్తి సన్నగిల్లిన ప్రస్తుత దశలో కర్ర సాయం లేనిదే వడ్డే కదిలే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో కూడా రైతుకు కష్టం వచ్చిందని తెలుసుకున్న వడ్డే… తనదైన శైలి పోరాటం మొదలెట్టేశారు. ఓ వైపు ఢిల్లీని చుట్టుముట్టిన అన్నదాతలకు ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూనే ఏపీలో తనవంతుగా ఉద్యమాన్ని నడిపిన వడ్డే… మంగళవారం ఢిల్లీ సరిహద్దుల్లో ప్రత్యక్షమయ్యారు. చేతి కర్ర సాయం ఉన్నా కూడా నిలబడలేని స్థితిలో ఉన్న వడ్డే తమ వద్దకు వచ్చేసరికి అన్నదాతలు కరిగిపోయారు. రెట్టించిన ఉత్సాహంతో నినాదాలు చేశారు. ఢిల్లీ వెళ్లడానికి ముందే ప్లాన్ చేసుకున్న వడ్డే… ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుందనుకున్నారో, ఏమో తెలియదు గానీ… తన ఢిల్లీ టూర్ మొదలయ్యే నాటికే ఏపీలో చేపట్టిన ఉద్యమాల క్రమంలోనే ఢిల్లీ రైతుల సాయం కోసం విరాళాలు సేకరించారు. అలా పోగైన రూ.10 లక్షలను తీసుకెళ్లిన వడ్డే… ఆ మొత్తాన్ని ఆందోళనలు చేస్తున్న రైతులకు అందజేశారు.
రైతుకు ఏ రీతిన లబ్ధి చేకూరుస్తాయో చెప్పాలి
ఈ సందర్భంగా అక్కడి రైతుల కోరిక మేరకు మైకందుకున్న వడ్డే శోభనాద్రీశ్వరరావు… మోదీ సర్కారు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. సాగు రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తానంటూ మోదీ సర్కారు తీసుకువచ్చిన మూడు కొత్త సాగు చట్టాలు ఎవరికి లబ్ధి చేకూర్చుతాయన్న విషయాన్ని కూడా వడ్డే చాలా వివరంగానే చెప్పేశారు. అంబానీ, ఆదానీలకు రైతు శ్రమను దోచిపెట్టేందుకే మోదీ సర్కారు ఈ సాగు చట్టాలను తీసుకొచ్చిందని వడ్డే నిప్పులు చెరిగారు. అసలు రైతు శ్రేయస్సు కోసం తీసుకువచ్చామని చెబుతున్న ఈ సాగు చట్టాలు.. రైతుకు ఏ రీతిన లబ్ధి చేకూరుస్తాయో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనని కూడా వడ్డే సంచలన వ్యాఖ్య చేశారు. రైతన్నకు కనీస మద్దతు ధర కల్పిస్తామని చెప్పిన మోదీ… ఇప్పుడు కొత్త సాగు చట్టాలతో కార్పొరేట్ రంగానికి సాగు రంగాన్ని ధారాదత్తం చేసేందుకే యత్నిస్తున్నారని ఆరోపించారు. రైతు పొట్టగొట్టి కార్పొరేట్‌కు పట్టం కట్టేందుకు మోదీ చేస్తున్న యత్నాలను చూస్తూ సహించేది లేదని కూడా వడ్డే హెచ్చరించారు.
వేంకటేశ్వరుడి సాక్షిగా ఇచ్చిన హామీ మరిచిన మోదీ
ఈ సందర్భంగా 2014 ఎన్నికల సందర్బంగా తిరుపతి వచ్చిన మోదీ… నాడు రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను వడ్డే మరోమారు గుర్తు చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని హామీ ఇచ్చిన మోదీ… ఈ నాడు రైతుల వెన్ను విరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్వామినాథన్ కమిటీ సూచనలను అమలు చేస్తామని తిరుమల వేంకటేశ్వరుడి సాక్షిగా హామీ ఇచ్చిన మోదీ దానిని ఇప్పుడు ఎందుకు మరిచారని కూడా నిలదీశారు. కనీస మద్దతు ధరతో పాటు రైతుల పండించే పంటల విక్రయాలకు కేంద్రాలుగా నిలుస్తున్న మార్కెట్ యార్డులను రద్దు చేసేలా మోదీ సర్కారు తీర్మానించడం, ఆ దిశగానే కొత్త సాగు చట్టాలను తీసుకురావడం సరికాదని కూడా వడ్డే హితవు చెప్పారు. మోదీ సర్కారు గద్దెనెక్కాక దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని కూడా వడ్డే ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన కొంతకాలంగా రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలను ఎందుకు పెడచెవిన పెడుతున్నారని కూడా వడ్డే మండిపడ్డారు. ఈ తరహా వైఖరితోనే మోదీ ముందుకు సాగితే… భవిష్యత్తులో చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని, రైతులతో పాటు యావత్తు దేశ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని కూడా వడ్డే హెచ్చరించారు.
రైతు కుటుంబంలో పుట్టి.. ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడు
ఇక వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రస్థానం చూస్తే… రైతు కుటుంబంలో పుట్టిన వడ్డే… ఇంజినీరింగ్ పట్టభద్రుడు. సొంతూరు ఉయ్యూరు కేంద్రంగా సాగు చేసుకుంటూనే అటు రైతు ఉద్యమాల్లో చురుగ్గా పాలుపంచుకునే వడ్డే… ఆ క్రమంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా వ్యవహరించిన వడ్డే… రెండు పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించారు. ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచిన వడ్డే… అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. సాగుపై తనకున్న మక్కువతో ఇతర మంత్రిత్వ శాఖలను ఆఫర్ చేసినా కూడా తనకు ఇష్టమైన సాగు వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏరికోరి మరీ తీసుకున్నట్లుగా చెబుతారు. ఉమ్మడి రాష్ట్రం రెండు ముక్కలైన నేపథ్యంలో రాజకీయాలను వదిలేసిన వడ్డే… రైతు సమస్యలపై ఎక్కడ ఏ ఆందోళన జరిగినా కూడా ముందు వరుసలో ఉంటూ వస్తున్నారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు జగన్ జమానాలో తీరని అన్యాయం జరుగుతున్న తీరుపై కూడా వడ్డే తనదైన శైలి ఉద్యమాన్ని నడిపారు. మొత్తంగా వడ్డేలో ఎన్ని పార్శ్వాలున్నా… రైతు బాంధవుడిగానే నిలిచిపోయేలా వడ్డే వ్యవహరిస్తూ వస్తున్నారు.