నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులు అనుమతించిన సమయం కన్నారెండు గంటల ముందే ర్యాలీ ప్రారంభించిన రైతులు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రకోటను ముట్టడించి జెండా ఎగురవేశారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను రైతులు ట్రాక్టర్లతో తొలగించారు. దీంతో పోలీసులకు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎర్రకోటలోకి రైతులు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రైతులపై లాఠీఛార్జి చేశారు. రైతులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఓ రైతు మరణించారు. దీంతో ఐటీఓ వద్ద తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో రైతుల్లో ఓ గ్రూపు ఎర్రకోట వైపు దూసుకెళ్లింది. ఎర్రకోట బురుజులపై ఎక్కి రైతులు జెండాలను ఊపుతూ ఆందోళనకు దిగారు. రైతులకు నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో రైతులు ఎర్రకోటలో ప్రవేశించినట్టు తెలుస్తోంది.
ఐటీఓ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ రైతు మరణించడంతో రైతులు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. లక్షలాది మంది రైతులు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు దాదాపు చేతులెత్తేశారని చెప్పవచ్చు. ముందు జాగ్రత్తగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ 20 మెట్రో స్టేషన్లను మూసి వేసింది. ఢిల్లీ సెంట్రల్, ఢిల్లీ నార్త్, ఐటీఓ, ఇంద్రప్రస్థ, లాల్ కిలా స్టేషన్లను మూసి వేశారు.
Must Read ;- ఎర్రకోటపై రైతన్నల జెండా రెపరెపలు