త్వరలో జరగనున్న ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తప్ప ఏ పార్టీకైనా ఓటు వేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశాయి. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధిల్లీ పరిసరాల్లో రైతులు 105రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతు సంఘాలతో జరిపిన చర్చల్లో కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం సాగుతుందని రైతు సంఘాలు ప్రకటించడంతోపాటు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో రైతు సంఘాలు పర్యటించి మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నాయి.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో..
తాజాగా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయద్దని కోరుతూ 40రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా పశ్చిమబెంగాల్ ఓటర్లకు విన్నవించింది. తాము ఎవరికీ మద్దతు పలకడం లేదని, ఎవరికి ఓటు వేయాలో చెప్పడం లేదని, అయితే రైతులకు తీవ్ర నష్టం కలిగించే చట్టాలను అమలు చేసేందుకు సిద్ధం అవుతున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని కోరుతున్నామన్నారు. ఈ మేరకు రైతు సంఘాల నేత యోగేంద్ర యాదవ్ పిలుపు నిచ్చారు. ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పినప్పుడే కేంద్రం ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. మరోవైపు పశ్చిమబెంగాల్ లో రైతుసంఘాల నేతలు ఇప్పటికే పర్యటిస్తున్నారు. రాకేష్ సింగ్ తికాయత్, యధువీర్ సింగ్‌లు పశ్చిమబెంగాల్‌కు చేరుకున్నారు. భవానీపూర్, నందిగ్రమ్, సింగూర్ తదితర ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేశారు. ఈ సభల్లో వారు ప్రసంగించనున్నారు.
బీజేపీలో టెన్షన్..
పశ్చిమబెంగాల్లో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (AITC)పై ఎన్నికలకు ముందే ఆధిపత్యం సాధించాలన్న వ్యూహాలను అమలు చేసిన బీజేపీ వ్యూహాలు పూర్తి శాతం ఫలితానివ్వలేదు. గుజరాత్ వర్సెస్ బెంగాలీ, జై శ్రీరాం నినాదానికి వ్యతిరేకంగా హరే కృష్ణ, జై కాళీ నినాదాలను మమత బెనర్జీ తెరపైకి తెచ్చింది. ఇక మైనార్టీ నియోజకవర్గాల్లో టీఎంసీ ఏమాత్రం ఇతర పార్టీల వారికి ప్రచారానికి కూడా అవకాశం ఇవ్వని విధంగా వ్యవహరిస్తోంది. రెండురోజుల క్రితం మమత బెనర్జీపై దాడి ఘటన (వాస్తవాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది)తో మమత బెనర్జీపై సానుభూతి పెరిగిందనే అంచనాలున్నాయి. దీంతో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఉన్న పరిస్థితికి ఇప్పటికి మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా రైతు సంఘాల నాయకుల పర్యటన కూడా బీజేపీకి ఇబ్బందిగానే పరిణమించనుంది.
వెంటనే అనుమతులు..
రైతు సంఘాల నాయకుల పర్యటనకు, సభలకు స్థానిక రైతు సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు దరఖాస్తు చేసిన రెండురోజుల్లోనే అన్నిరకాల అనుమతులు వచ్చినట్టు తెలుస్తోంది. కొవిడ్ నియంత్రణకు సంబంధించి మార్గదర్శకాలను పాటించాలని ఒకే ఒక కండీషన్ పెట్టి అనుమతులు వెంటనే వచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం కాబట్టి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో అనుమతులు కూడా వచ్చాయని తెలుస్తోంది. నందిగ్రమ్, సింగూరుల్లాంటి ప్రాంతాల్లో రైతు ఉద్యమాలకు ఆదరణ ఉంటుంది. మమత బెనర్జీ అధికారం చేజిక్కించుకోవడానికి కూడా రైతు, భూ సేకరణ వ్యతిరేక ఉద్యమాలే కారణం. ఈ నేపథ్యంలో రైతుసంఘాల నేతలు కూడా ఆయా ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేస్తుండడంతో దాదాపు 15నియోజకవర్గాల్లో ఈ ప్రభావం పడనుందన్న అంచనాలున్నాయి.
Must Read ;- ఎన్నికల వేళ.. మోదీ సర్కారుకి రైతు సంఘాల ఊహించని షాక్