ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుందంటారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే సినిమా ఆలోచన సూపర్ స్టార్ కృష్ణగారి జీవితాన్ని ఎలా మార్చేసింది. ఈ సినిమా విడుదలై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాగా ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. గుడ్ బ్యాడ్ అగ్లీ, మెకన్నాస్ గోల్డ్, ట్రెజర్ ఐలండ్ లాంటి హాలీవుడ్ చిత్రాల గురించి మీరు వినే ఉంటారు. టాప్ టెన్ హాలీవుడ్ చిత్రాల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఈ ఈ సినిమాలు ఉంటాయి. కృష్ణగారి టాప్ టెన్ సినిమాల జాబితా తీసినా మోసగాళ్లకు మోసగాడు ఉంటుంది.
అదేంటి ? వాటికీ దీనికీ సంబంధం ఏంటి అన్న ఆలోచన మీకు వచ్చే ఉంటుంది. ఆ హాలీవుడ్ సినిమాల నుంచి పుట్టిన ఆలోచనే మోసగాళ్లకు మోసగాడు చిత్రం. తెలుగులో కౌబోయ్ కాన్సెప్ట్ కు తెరతీసిన తొలి సినిమా మోసగాళ్లకు మోసగాడు. దీనికి నిర్మాత కృష్ణ గారి సోదరుడు జి. ఆదిశేషగిరిరావు. ఈ సినిమాకి కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించారు. హాలీవుడ్ చిత్రాలను తలపింపచేసే సాహసకృత్యాల నేపథ్యంలో మొదటిసారి ఓ తెలుగు సినిమా తెరకెక్కడం విశేషం. పద్మాలయ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా 1971ఆగస్ట్ 27న విడుదలైంది. అంటే ఈ ఆగస్టు 27కి కచ్చితంగా 50 ఏళ్లు పూర్తవుతుందన్న మాట.
గ్రాఫిక్స్ లేని రోజుల్లో పాన్ ఇండియా ప్రయోగం
ఈ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయలేరు. కానీ ఆ రోజుల్లోనే సూపర్ స్టార్ కృష్ణ పాన్ ఇండియా సినిమా తీసి చూపించారు. మోసగాళ్లకు మోసగాడు 56 దేశాలలో ప్రదర్శితమై సంచలనాలు నమోదుచేసింది. తమిళ్ లో మోసక్కారన్ కు మోసక్కారన్, ఇంగ్లీష్ లో ట్రెజర్ హంట్ పేరుతో అనువాదమైంది. రిపీట్ రన్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావడం ఈ సినిమాలోని మరో విశేషం. ఆ రోజుల్లోనే టెక్నికల్‌గా చాలా హై వ్యాల్యూస్‌తో వచ్చే హాలీవుడ్ సినిమాలతో పోటీపడింది ఈ సినిమా.
కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం, వి.ఎస్.ఆర్. స్వామి ఫోటోగ్రఫి, కోటగిరి గోపాలరావు ఎడిటింగ్, ఆరుద్ర కథ.. వెరసి మోసగాళ్లకు మోసగాడు సినిమా. అప్పటిదాకా ఆరుద్రగారు పాటలే ఎక్కువగా రాసేవారు. హాలీవుడ్ స్థాయి నిర్మాణానికి అనుగుణంగా ఆ కథ రాశారు. దీనికి ఆదినారాయణ సంగీతం సమకూర్చారు. ఆయనేంటి వెస్ట్రన్ మ్యూజిక్ ఏంటి అన్నవారు ఆ తర్వాత నోరు మూసేశారు. ఆ సినిమాకు చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ పెద్ద సంచలనమే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఏ సినిమాకీ రాని ప్రశంసలు దీనికే దక్కాయి. ఆ రోజుల్లో అతి తక్కువ బడ్జెట్ తో ఈ చిత్ర నిర్మాణం జరిగింది.
ఎడారుల్లో ఖర్చుకు వెనకాడకుండా..
రాజస్తాన్ ఎడారుల్లో, హిమాలయాల్లోని మంచుకొండల్లో, పాండిచ్చేరి లాంటి ఎర్రమట్టి కోటల్లో ఇలా అనేక ఔట్‌డోర్ లొకేషన్స్‌లో చేసిన కొత్తప్రయోగమే ఈ సినిమా. హీరో హీరోయిన్లుగా కృష్ణ, విజయనిర్మల పెద్ద హైలైట్ గా నిలిచారు. ఈ తరహా పాత్రలను కృష్ణగారు అవలీలగా పోషించగలరని అర్థమైంది. నాగభూషణం, జ్యోతిలక్ష్మీ, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి , జగ్గారావు, ఆనంద మోహన్, త్యాగరాజు లాంటి వారు కూడా తోడవడంతో ఈ సినిమాకు మరింత నిండుతనం వచ్చింది. అసలు కృష్ణ గారు ఈ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది పెద్ద ప్రశ్న. మూస పాత్రల్లో కొట్టుకుపోకుండా వైవిధ్యం కోసమే ఆయన ఈ కౌబోయే సినిమాని ఎంచుకున్నారు.
ఆ రోజుల్లో అసాధ్యుడు, గూఢచారి 116, అవేకళ్లు లాంటి యాక్షన్ సినిమాలు వచ్చినా ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా అలవాలైపోవడంతో ఆ సమయంలో కొంచె కొత్తదనం కావాలనుకున్నారు కృష్ణ. అందులోనూ ఆ సినిమాకు ముందు ఆయన నటించిన ఏడెనిమిది సినిమాలు సరిగా ఆడలేదు. అందులో వీరు తీసిన ‘అగ్నిపరీక్ష’ కూడా ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే పెద్ద పెద్ద బ్యానర్స్ లో సినిమాలు చేస్తుండేవారు. వారికి పోటీగా ఎదగాలన్న ప్రయత్నంలో హాలీవుడ్ సినిమాలు ఎక్కువ ప్రభావం చూపిస్తుంటే ఆ ఒరవడిలో మనం కూడా మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా తీస్తే బాగుంటుంది అన్న ఆలోచనే ‘మోసగాళ్ళకు మోసగాడు’ తీసేలా చేసిందట.
అప్పట్లో కలర్ సినిమాలని ఎక్కువగా ప్రోత్సహించేవారు కాదు డిస్ట్రిబ్యూటర్స్. అయినా సరే రాజీ పడకుండా కలర్ లోనే సినిమా తీశారు. ఈ సినిమా తర్వాత దీని స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలు చేయడానికి హీరో కృష్ణ సాహసించారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అన్న పేరు కృష్ణ గారికి రావడానికి ఇలాంటి ప్రయోగాలే కారణం. మొదటి కలర్ చిత్రం, మొదటి సినిమా స్కోప్ చిత్రం.. ఇలాంటి క్రెడిట్స్ అన్నీ కృష్ణగారికే దక్కుతాయి.
ఇవండీ 50 క్రితం నాటి ఈ సినిమా విశేషాలు. హాలీవుడ్ సినిమా స్పూర్తి అయినా తెలుగు నేటివిటీకి తగ్గకుండా చేయడమే ఇందులోని గొప్ప విశేషం. పద్మాలయా సంస్థ మళ్ళీ సినిమాల నిర్మాణం చేసే ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు సమాచారం. కృష్ణ సోదరుడు హనుమంతరావు కుమారులు ప్రసాద్ బాబు నరసయ్య బాబు, అదిశేషగిరి రావు కుమారుడు రాఘవ రత్న బాబు సారథ్యంలో ఈ సంస్థ మళ్లీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- దుమ్మురేపేస్తున్న మహేశ్ బాబు టీజర్











