వినోద రంగంలో ఉండే వారికి ఇది శుభవార్తే. మార్కెట్లో ఎలాంటి కెమెరాలు ఉన్నాయి? ఎలాంటి మైక్ లు వస్తున్నాయి? ఎడిటింగ్ సాఫ్ట్ వేర్స్ ఏమేం ఉన్నాయి? భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? తదితర అంశాలను తెలుసుకునేందుకు ఓ ఎగ్జిబిషన్ ఉంటే ఎంత బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంటుంది. సాధారణంగా ఇలాంటి వాటి కోసం ముంబై లాంటి నగరాలకు పరుగెడుతుంటారు. కానీ ఈసారి ఆ సౌకర్యం మన హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటవుతోంది.
వచ్చే మార్చి 6, 7, 8 తేదీల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ ప్రదర్శన ఏర్పాటవబోతోంది. ఇలాంటి కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన బిగ్గెస్ట్ ఫిల్మ్ అండ్ బ్రాడ్ కాస్ట్ ఎక్స్ పో పోస్టర్ ను హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ ఎక్స పో ప్రత్యేకతలను కూడా వివరించారు. ఈ గ్రాండ్ పోస్టర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, హీరో శ్రీకాంత్, రాజ్ కందుకూరి, మామిడి హరికృష్ణ, దర్శకులు నీలకంఠ, చంద్ర సిద్దార్థ్, రసూల్ ఎల్లోర్, వి ఎన్. ఆదిత్య, వీర శంకర్, లక్ష్మి భూపాల్, కాశీ విశ్వనాధ్, ముకేశ్ రెడ్డి, అభిమన్యు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా పోస్టర్ ని సి. కళ్యాణ్, శ్రీకాంత్, కాశీ విశ్వనాధ్, రాజ్ కందుకూరి తదితరులు ఆవిష్కరించారు. దీనికి నిర్మాతల మండలి తరఫున అవసరమైన సహాయ సహకారాలను అందించటానికి తాము సిద్ధంగా ఉన్నామని నిర్మాత సి. కళ్యాణ్ అన్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. ఇది సినిమా టెక్నాలజీకి సంబంధించిన అంశం కాబట్టి ఇండస్ట్రీకి చాలా అవసరం ఉందని హీరో శ్రీకాంత్ అన్నారు.
దీని కన్వీనర్ వీరశంకర్ మాట్లాడుతూ ఈ ఎక్స్ పో లో భాగంగానే షార్ట్ ఫిలిం మేకర్స్ కు పోటీ పెట్టామన్నారు. ఇందులో నవరసం, వెబ్ సిరీస్ , షార్ట్ ఫిలిం లకు అవార్డులు అందించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఫొటోగ్రఫీలో కొత్త టెక్నాలజీని అందించాలనే ఉద్ధేశంతోనే ఈ ఎక్స్ పో పెట్టడం జరుగుతోందని ఫొటో టెక్ అధినేత అభిమన్యు రెడ్డి అన్నారు. ఈ పోటీలకు సంబంధించిన జ్యూరీ సభ్యుల వివరాలను కూడా వెల్లడించారు.