ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలకు వైసీపీ మోకాలు అడ్డుతోందా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇందుకు సంబధించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దంటూ పెట్టుబడి దారులకు దాదాపుగా 200కుపైగా మెయిల్స్‌ను ఉమాశంకర్ అనే వ్యక్తి పంపినట్లు పయ్యావుల కేశవ్ నిర్ధారించారు. ఈ ఉమాశంకర్ వెనుక వైసీపీ శక్తులు ఉన్నాయన్నారు. మాజీ సీఎం జగన్, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన ఈ కుట్రకు తెరలేపారని కేశవ్ ఆరోపించారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఏపీ బ్రాండ్ తగ్గలేదని, పక్కా ఆధారాలతోనే ఈ ఆరోపణలు చేస్తున్నామన్నారు కేశవ్. ఇంకెంతకాలం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడతారంటూ జగన్‌పై మండిపడ్డారు.
ప్రతిపక్షంలో ఉంటే వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఎంతకైనా తెగిస్తుందన్నారు కేశవ్. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు వైసీపీ అమలు చేస్తున్న వ్యూహాల్లో మెయిల్స్ ఒకటిగా తెలుస్తోంది. గతంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టవద్దని పెద్ద ఎత్తున మెయిల్స్ ద్వారా ఫిర్యాదులు చేశారు. దాంతో పలుమార్లు వారు చేసిన ఫిర్యాదుల్లో నిజం ఏమిటో తెలుసుకునేందుకు ప్రపంచ బ్యాంక్ బృందాలు వచ్చాయి. అవన్నీ ఫేక్ మెయిల్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే రుణం మంజూరు చేశారు. తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ రుణం తీసుకోలేదు. అమరావతిని సైతం జగన్ పెద్దగా పట్టించుకోలేదు.
ఇక ఇప్పుడు టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అమరావతిలో అభివృద్ధి పనులు చకచకా నడుస్తున్నాయి. దీంతో వైసీపీ నేతలకు కడుపు రగిలిపోతుంది. మళ్లీ ప్రపంచబ్యాంకుకు దొంగ మెయిల్స్ పంపించారు. ఐతే ఈ సారి వైసీపీ లేఖలను వరల్డ్ బ్యాంకు పెద్దగా పట్టించుకోలేదు.
ఇక ఇప్పుడు ఏపీకి వస్తున్న పెట్టుబడులపైనా వైసీపీ కన్నుబడింది. దీంతో పెట్టుబడులను ఎలాగైనా ఆపాలని ఆ పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారు. పెట్టుబడులను అడ్డుకునేందుకు దారుణమైన కుట్రలకు తెగబడుతున్నారు ఆ పార్టీ నేతలు. పెట్టుబడులు రావడం ఆ పార్టీకి ఏ మాత్రం ఇష్టం లేదు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ నేతలు గండి కొట్టాలని చూస్తున్నారు. పెట్టుబడిదారులకు దొంగ మెయిల్స్ పంపి భయపెడుతున్నారు వైసీపీ నేతలు. వారికి భయపడి కొంత మంది వెనక్కి తగ్గినా…అది ఏపీకి నష్టమే చేస్తుంది. ఐనప్పటికీ వైసీపీ నేతలు ఆలోచించడం లేదు.
ఐతే జగన్ సర్కార్ చేస్తున్న కుట్రలను కూటమి సర్కార్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. ప్రధానంగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్ వైసీపీ నేతలకు ఎక్కడా ఛాన్స్ ఇవ్వడం లేదు. పెట్టుబడులకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు సూచిస్తున్నారు. జగన్ సర్కార్ తిరిగి అధికారంలోకి రాదన్న భరోసా కల్పిస్తున్నారు.











