టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా ఒక వెలుగు వెలిగిన విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆ పార్టీపై అలక బూనారు. విజయనగరంలో బలీయమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గీత పట్టణంలో పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినప్పటికీ గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ విజయనగరం అసెంబ్లీ టికెట్ ఆమెకు రాకపోవడంతో మౌనం దాల్చారు. అధిష్టానం బుజ్జగించడంతో అప్పట్లో పార్టీ ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, తరువాత నుండి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
కీలకంగా వ్యవహరించినప్పటికీ ..
విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలో మీసాల గీత టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ పటిష్టతకు అహర్నిశలూ కృషి చేశారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గీత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో జత కట్టి టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు బంగ్లాకు దూరమయ్యారు. గత సాధారణ ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు తన కూతురు అదితిని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా బరిలో దింపడంతో టీడీపీ అధిష్టానం ఆమెకే టికెట్ ఖరారు చేసింది. చివరి క్షణాల వరకు టీడీపీ టికెట్ ఆశించిన గీత భంగపాటుకు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో గీత పూర్తి స్థాయిలో సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అదితి ఓటమికి తూర్పు కాపుల ఆగ్రహమే కారణమనే ప్రచారం కూడా ఉంది. బీసీల్లో బలమైన తూర్పు కాపు వర్గం నుంచి మహిళా నేతగా ఉండడం, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గీతను పక్కన పెట్టడం వల్ల ఆమె కుల సంఘాల ద్వారా తనకు జరిగిన అన్యాయన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారనే గుసగుసలు వినిపించాయి. ఇవన్నీ అదితి ఓటమికి కారణమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల అనంతర పరిణామాల్లో కూడా గీతకు టీడీపీ అధిష్టానం సముచిత స్థానం ఇవ్వలేదు. ఇటీవల పార్టీ వ్యవస్థాగత పదవుల్లోనూ గీతను పట్టించుకోలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆమె తనింకా పార్టీలో ఉండే పరిస్థితి కనిపించడం లేదని తన అనుచరుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.
ఒంటరిని చేస్తుండటమే ..
టీడీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే గీతను అధిష్టానం ఒంటరిని చేస్తుండటంతో ఆమె అనుచరులు ఆగ్రహిస్తున్నారు. ఆమె పార్టీకి చేసిన సేవగాని, కష్టాన్ని గాని గుర్తించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న తూర్పు కాపు కులానికి చెందిన గీత 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో 28వేల ఓట్లే సాధించినా, రాజకీయంగా మంచి గుర్తింపు పొందారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో టీడీపీ తరఫున విజయనగరం టికెట్ సాధించి విజయం సాధించారు. ఆ సమయంలో నియోజకవర్గం అభివృద్ధికి, పార్టీ పటిష్టతకు, తూర్పు కాపు సామాజిక వర్గాన్ని టీడీపీకి చేరువ చేయడంలోనూ గీత కీలక పాత్ర పోషించారు. అటువంటి వ్యక్తికి గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ నిరాకరించడంతో ఆమె వర్గీయులు అసహనం వ్యక్తం చేశారు.
వైసీపీలో చేరేందుకు ..
బలమైన సామాజిక, ఆర్థిక పరిపుష్టిత కలిగిన గీత వైసీపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఆ పార్టీ నుండి ఆహ్వానంతో పాటు రాజకీయ ప్రాధాన్యతతో కూడిన హామీ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.