బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ మ్యాజిక్ కనిపించింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇండియాను ముందుకు నడిపించడంలో కెప్టెన్ రహానె సక్సెస్ అయ్యాడనే అనిపిస్తోంది. ఆసీస్ దూకుడుకు ఏ మాత్రం తీసిపోకుండా అతను క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తొలి టెస్టు విజయంతో దూకుడు మీదున్న ఆస్ట్రేలియాను 200 పరుగులలోపే ఆలౌట్ చేయడం శుభసూచకంగా కనిపిస్తోంది. రెండో టెస్ట్ లో ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి టీమిండియా దే అప్పర్ హ్యాండ్ గా కన్పిస్తోంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా తొలి రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారాతో కలిసి మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రోజును ముగించారు. గిల్ 28 పరుగులు, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి టీమిండియా తొలి రోజు మూడు సెషన్లలోనూ తన ఆధిపత్యం చూపించింది.
ఆసీస్ 200లోపే ఆలౌట్…
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో తడబడుతూ ఆడింది. భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను గట్టిగా దెబ్బతీశారు. దీంతో ఆతిథ్య ఆసీస్ 195 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తక్కువ పరుగుల వ్యవధిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. లబుషేన్ 48, హెడ్ 38, వేడ్ 30, గ్రీన్ 12, పైన్ 13 మినహా అందరూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఓ వికెట్ తీశారు.
అది రహానెకే సాధ్యమైంది…
మైదానంలో క్రీడాకారుల్లో ఆత్మస్తైర్యం నింపడంలో రహానె వ్యవహరించిన తీరుపై ఆధ్యాంతం ప్రశంసలు కురుస్తున్నాయి. బాక్సింగ్ డే మ్యాచ్ తో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్‌ను టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానె వినూత్న రీతిలో గౌరవించాడు. టీ విరామం సమయంలో కెప్టెన్ రహానె సిరాజ్ వద్దకు వెళ్లి ..నువ్వు ముందు వెళ్లు.. నీ వెనకాల మేము వస్తాం అని చెప్పాడు. రహానె చెప్పినట్లుగా సిరాజ్ ముందు నడవగా.. టీమ్ మొత్తం అతని వెనకాల నడిచింది. టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన సిరాజ్‌కు మేము ఇచ్చే గౌరవం ఇదేనని రహానె తెలిపాడు. రహానె తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. కెప్టెన్ కి ఉండే అన్ని లక్షణాలు రహానేలో ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. ఒక డెబ్యూ ఆటగాడిని ఇలా గౌరవించడం రహానెకు మాత్రమే చెల్లింది.
24 ఏళ్ల తర్వాత టెస్ట్ జట్టులో హైదరాబాదీ..
బాక్సింగ్ డే టెస్ట్ లో హైదరాబాదీ సిరాజ్ చోటు దక్కించుకున్నాడు. అంతే కాకుండా రెండు కీలకమైన వికెట్లతో ఆస్ట్రేలియాను దెబ్బకొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లబుషేన్‌ను అవుట్ చేయడం ద్వారా మహ్మద్ సిరాజ్ టెస్టు క్రికెట్‌లో మెయిడెన్ వికెట్ సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా రెండు క్యాచ్ లను కూడా అందుకున్నాడు. ఎంట్రీ మ్యాచ్ తోనే అదుర్స్ అన్పించాడు. 24 ఏళ్ల తర్వాత ఓ హైదరాబాదీగా జట్టులోకి వచ్చిన సిరాజ్ వారెవ్వా అన్పించాడు. తాను ఎంతగానో ప్రేమించే నాన్న కడచూపునకు దూరమైనా.. భారత్‌కు ఆడాలన్న కాంక్ష అతడిని ముందుకు నడిపించింది. గుండెలోతుల్లోని దుఃఖాన్ని దిగమింగుకుంటూ తొలిసారి టెస్టుల్లో భారత్ తరఫున సిరాజ్ అరంగేట్రం చేశాడు.
ఆసీస్ కెప్టెన్ రెండుసార్లు అవుట్.. కానీ…
ఆసీస్ బ్యాటింగ్ చేసే సమయంలో థర్డ్ నిర్ణయాలు రెండు సార్లు టీమిండియాకు వ్యతిరేకంగా రావడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన తొలి టెస్టు వికెట్‌గా మార్నస్ లబుషేన్‌ను ఔట్ చేసి జోరు మీదున్న సిరాజ్ చక్కని బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఆ క్రమంలోనే ఆట 50 వ ఓవర్‌లో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌ను ఓ అద్భుతమైన బంతితో ఎల్బీగా ఔట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే, సిరాజ్ అప్పీల్‌ను అంపైర్ పట్టించుకోకపోవడంతో.. టీమిండియా కెప్టెన్ రహనే డీఆర్‌ఎస్ కోరాడు. రీప్లేలో బంతి లెగ్‌సైడ్ వైపుగా వెళ్తున్నట్టుగా తేలడంతో థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ నిర్ణయం ఫీల్డ్ అంపైర్‌కే వదిలేశాడు. అలా టిమ్ బతికిపోయాడు.
ఆట 55 వ ఓవర్‌లోనూ అతను మరోసారి సేవ్ అయ్యాడు. అశ్విన్ వేసిన బంతిని మిడాఫ్‌లోకి షాట్ ఆడిన కామెరూన్ గ్రీన్ పరుగుకోసం యత్నించాడు.. పరుగు పూర్తవుతుందా లేదా అనే సందిగ్గంలోనే టిమ్ రన్ తీశాడు. అయితే, కీపర్ పంత్‌కు బంతి చేరడం, అతను వికెట్లను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి. కానీ, టిమ్ క్రీజుకు చేరుకున్నాడా లేదా అనే విషయమై కొంత అస్పష్టత ఉండటంతో థర్డ్ అంపైర్ విల్సన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద టిమ్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో టిమ్ మరోసారి బతికిపోయాడు. దీంతో థర్డ్ అంపైర్ పాల్ విల్సన్‌పై భారత క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
బాక్సింగ్ డే టెస్ట్ లో ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి టీమిండియాదే అప్పర్ హ్యాండ్ అనిపిస్తోంది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్ బెంబేలెత్తడం… క్రీజులో ఇండియా టీమ్ జోరుగా కనిపించడం… అంతా అనుకూలంగానే కనిపిస్తోంది. వచ్చిన సదావకాశాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకుంటుందా..? బౌలర్ల కష్టాన్ని బ్యాట్స్ మెన్లు నిలబెడతారా..?? ఏం జరుగుతుందో చూడాలిక!
Must Read ;- టీమిండియాకు అగ్ని పరీక్ష.. మలి సవాళ్లు ఇవే..!