టాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. హిట్టుకు .. హిట్టుకు మధ్య ఒక ఫ్లాప్ పడేస్తున్నా, ఆయన జోరు ఎంతమాత్రం తగ్గడం లేదు. ‘ఫైటర్’ సినిమాతో తన జోష్ చూపించడానికి మళ్లీ ఆయన రెడీ అవుతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తెలుగు .. హిందీతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తెలుగు తెరకి ‘అనన్య పాండే’ పరిచయం కానుంది. ఈ కొత్తమ్మాయి కొత్త అందాలు చూడటానికి కుర్రాళ్లు ఎంతో ఆత్రుతగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. రేపు ఉదయం 10:08 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదలనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దాంతో ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే టైటిల్ నే ఉంచుతారా? లేదంటే మార్చుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచి కూడా ఈ టైటిల్ తోనే ఈ సినిమా విశేషాలు అభిమానుల ముందుకు వెళుతూ వచ్చాయి. టైటిల్ కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ కి తగినట్టుగానే ఉందనే టాక్ వచ్చింది.
ఇంతకుముందు విజయ్ దేవరకొండ చేసిన ‘డియర్ కామ్రేడ్’ .. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు, భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి .. అదే స్థాయిలో నిరాశపరిచాయి. దాంతో ఈ సారి హిట్ కొట్టడమనేది తప్పనిసరి అయింది. ఎందుకంటే రేసులో వెనకబడిపోకుండా ఉండాలంటే విజయ్ దేవరకొండకి ఈ సినిమా హిట్ చాలా ముఖ్యమైనదనే చెప్పాలి. ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత పూరి చేసిన సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు ఉన్నాయి. మరి ‘ఇస్మార్ట్ శంకర్’ కి మించిన విజయాన్ని ఈ సినిమా అందిస్తుందా? లేదా? అనేది చూడాలి.