పాట అనేది రెండక్షరాల మాటే కావచ్చు.. అది పల్లె పట్టు నుంచి సినిమా బాట పట్టాక అధరామృతధారలు ఒలికిస్తోంది. నాలుగు రాళ్లు వెనకేసుకోడానికి నాలుగు వేల పైచిలుకు పాటలు ఆయా రచయితలకు ఎంతవరకు ఉపయోగపడ్డాయో తెలియదుగానీ ఆ పాట మదిలో నుంచి పుట్టాలంటే ఆ రచయితకు ఓ ప్రసవ వేదనే. పాట రాయడానికి ఇంత ఆలస్య చేస్తారెందుకు అంటే అది వస్తేనే కదా రాసేది అనేవారట ఆత్రేయ. అది ఎక్కడి నుంచి రావాలి? ఇదే పెద్ద ప్రశ్న. మనిషి అంతరంగమే ఓ పాల సముద్రం.
అందులో జరిగేదే క్షీరసాగరమథనం. దాన్ని ఎంతో మథిస్తేనేగాని అమృతం లాంటి పాట పుట్టదు.. అది పుట్టాక దానికి లభించేది అమరత్వమే. అందుకే ఆ పాట పుట్టడం కోసం కవి అంతటి ప్రసవ వేదనను అనుభవిస్తాడు. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతాడు. వేదాలు సజీవంగా ఉన్నాయంటే అవి శ్రుతులు కాబట్టే. అవి ఎవరో చెబితే రాసినవి కాదు.. లోపల నుంచి ఆ విధాత కనికరిస్తేనే ఆవిర్భవించినవి. అందుకే కవులను అమరులను చేస్తున్నాయి పాటలు. పాటల రాసే కవులను నిష్టూరంగా ఆడిపోసుకుంటుంటారు.
పాట త్వరగా ఇవ్వడం లేదన్నదే వారి ఆవేదన. రాసి ప్రేక్షకులను.. రాయక నిర్మాతలనూ ఏడిపిస్తారని ఆత్రేయ గురించి అంటుంటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రికీ అలాంటి నిందలు తప్పలేదు. ‘ఆయనతో పాట రాయించుకోవడం చాలా కష్టమండీ. దర్శకుడు రాత్రంతా ఆయనతో కూర్చోవాలి. లేకపోతే ఎన్ని నెలలైనా తెమలదు’ అని అంటుంటారు. సిగరెట్ పొగల్ని గుప్పు గుప్పుమంటూ వదులుతూ పాట కోసం పరితపిస్తుంటారు సిరివెన్నల సీతారామశాస్త్రి. పాట రాయాలంటే ఇంతటి ప్రసవ వేదన ఉన్నప్పుడు తొలి పాటకు ఇంకెంత ఉంటుంది చెప్పండి.
విధాత తలుపులు తెరిచాడు..
ప్రణవ నాదమైన ఓంకారంతోనే ఆయన పాటల ప్రపంచంలో ఓనమాలు దిద్దుకున్నారు. సినిమా పాటలు రాసే అలవాటు లేదు కాబట్టి మీకు ఎలా తోస్తే అలా పాట రాయండి ట్యూన్ కేవీ మహదేవన్ కట్టుకుంటారు అన్నారట కె. విశ్వనాథ్. సన్నివేశాన్ని వివరించి వదిలేశారు. మరి పాట ప్రభవించాలి కదా.. అందుకే పరితపించారు సీతారామశాస్త్రి. తనను తాను నిరూపించుకోవాలంటే మామూలు పదాలు రాయకూడదు.. కాస్త బరువైన పదాలు పడాల్సిందే అనుకున్నారు.
విధాత తలపున, ప్రభవించినది, అనాది జీవనవేదం, ఓం..
ప్రాణనాడులకి స్పందననొసగిన ఆది ప్రణవనాదం, ఓం ..
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎదకనుమలలో, ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ..
సరసస్వర సురఝరీ గమనమౌ, సామ వేద సారమిది
నే పాడిన జీవన గీతం, ఈ గీతం ..
విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం
– ఇలా సాగిపోతుంది పల్లవి. తానే బ్రహ్మగా ఈ కవిత్వం రాశానన్నది ఆ పాత్ర తాలూకు ఉద్ధేశం. ఓంకారం ఎలాగైతే బ్రహ్మ నుంచి ఉద్భవించిందో అలాగే తన నుంచి ఈ కవిత్వం ఆవిర్భవించిందని తన సాహిత్యంతో చెప్పారు. విరించినై విరచించితిని అనే పదప్రయోగం క్లిష్ట తరంగా ఉన్నా అది ఎంతో వినసొంపుగా ఉంది. ఇక చరణం విషయానకి వస్తే ‘ప్రాగ్దిశ వేణియపైన దినకర మయూఖతంత్రుల పైన’ అనే మరో క్లిష్టతరమైన పదప్రయోగం చూస్తే మరో దర్శకుడైతే ఏం పాట ఇది అని విసిరికొట్టే వారేమో. ఆయన కళా తప్పస్వి కథా సీతారామ శాస్త్రి పదాల్లోని గాఢతను అర్థం చేసుకున్నారు.
ఇక ప్రాగ్దిశ వేణియపైన అంటే తూర్పు దిక్కుఅనే వీణ మీద దినకర మయూఖ తంత్రుల పైన అంటే ఆ భానుడి కిరణాలు అనే తీగలపై అనే అర్థం వస్తుంది. మయూఖ అంటే కిరణం. ఏ శబ్ద రత్నాకరమో మన పక్క నుంటే తప్ప అర్థం కాని పదాలివి. ఇలాంటి పదప్రయోగాల వల్ల కనీసం మనకు డొక్క శుద్ది ఏర్పడుతుంది. చాలా మంది తమ పిల్లలకు మయూఖ అనే పేరు కూడా పెట్టేశారు. కవి ఎంతటి పరిశ్రమిస్తే ఇంతటి పాట పుట్టింది. 1985 అక్టోబర్ 4న సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను రికార్డ్ చేశారు. విశేషమేమిటంటే ఈ సినిమా 1986 మే 20న విడుదలైంది. సీతారామశాస్త్రి పుట్టిన రోజు కూడా ఇదే. ఇది కాకతాళీయమై అయినా ఆ సిరివెన్నెలే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.
– హేమసుందర్ పామర్తి
Must read ;- పాట రచయితకు సామాజిక బాధ్యతపై సిరివెన్నెల మాట