మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటన గురించి.. ఆయన ఎన్నుకొనే పాత్రల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మలయాళంతో పాటు పలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించి తనకు తానే సాటి అనిపించుకొన్నారు ఆయన. మిగిలిన భాషల సంగతి ఎలా ఉన్నా.. సొంతగడ్డ మీద ఆయన చేయని ప్రయోగం లేదు. పోషించని పాత్ర లేదు. అయినా సరే ఆయనకు తన మాతృభాషలో ఒక పాత్రను ఆయన ఇప్పటికీ పోషించలేకపోవడం ఆశ్చర్యమనిపించకమానదు. ఆ పాత్ర మరేదో కాదు. ముఖ్యమంత్రి. అవునండీ.. ఆయన మలయాళంలో ఇంతవరకూ ముఖ్యమంత్రిగా నటించలేదంటే మీరు నమ్ముతారా?
1995 లో తమిళంలో ఆర్.కె. సెల్వమణి దర్శకత్వంలో ‘మక్కళ్ ఆచ్చి’ అనే సినిమాలో మొదటిసారిగా మమ్ముట్టి ముఖ్యమంత్రిగా నటించారు. అదే సినిమా మలయాళంలో ‘ఎన్డే నాడు’ గా డబ్బింగ్ అయింది. అలాగే.. ఆ సినిమానే తెలుగులో ‘చీఫ్ మినిస్టర్’ అనే పేరుతో అనువాదమైంది. ఇక 2019 లో వచ్చిన యాత్ర సినిమా గురించి తెలిసిందే. అందులో వై.యస్.రాజశేఖర రెడ్డిగా నటించి మెప్పించిన మమ్ముట్టి.. క్లైమాక్స్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. అలా.. మమ్ముట్టి.. తమిళ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా నటించి రెండు భాషల్లోనూ హిట్స్ సొంతం చేసుకున్నారు. కానీ.. కేరళ రాష్ట్రానికి మాత్రం ఆయన ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిగా నటించనేలేదు. అయితే ఎట్టకేలకు ఆ లోటు కూడా త్వరలోనే తీరనున్నది. మొదటి సారిగా ఆయన కేరళ ముఖ్యమంత్రిగా నటించిన సినిమా పేరు ‘వన్’. సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది మేలో విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా వేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ … దీన్ని త్వరలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రజల్ని పరిపాలించే వాడు ముఖ్యమంత్రి కాదు. ప్రజలకోసం పరిపాలన సాగించేవాడే ముఖ్యమంత్రి అనే థీమ్ తో ఈ సినిమా రూపొందింది. కేరళలోని ప్రస్తుత పరిస్థితుల్ని కళ్ళకు కడుతూ.. అక్కడి ప్రజలకు ఒక రోల్ మోడల్ లాంటి ముఖ్యమంత్రిని ఈ సినిమాతో చూపించబోతున్నాడు దర్శకుడు. మరి ‘వన్’ సినిమాతో సొంత గడ్డపై మమ్ముట్టి ముఖ్యమంత్రిగా ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.
మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...











