‘అ’ సినిమాతో తనలోని ఇన్నోవేటివ్ థాట్స్ ను వెలికితీసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇదో ప్రయోగాత్మక థ్రిల్లర్. తొలి ప్రయత్నంలోనే పలువురు ప్రశంసలందుకున్న ఈ దర్శకుడు మలి ప్రయత్నం రాజశేఖర్ ‘ కల్కి’ అంతగా అలరించలేకపోయింది. అయినా సరే ఏమాత్రం నిరాశచెందక, తెలుగులో మొట్టమొదటి జాంబీ మూవీ జాంబీ రెడ్డిని రూపొందించి .. థియేటర్స్ లోనూ, ఓటీటీలోనూ, టీవీల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని జాంబీ జోనర్ లో రూపొందించి మంచి హిట్టు కొట్టాడు.
ఇప్పుడు ఇదే దర్శకుడు తెలుగులో మొట్టమొదటి ఒరిజినల్ సూపర్ హీరో మూవీని రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. సినిమా పేరు ‘హనుమాన్’. ఈ రోజు ప్రశాంత్ వర్మ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ .. ‘హనుమాన్’ సినిమా కు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను, అలాగే.. మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే ఈ సినిమా కథ , కాన్సెప్ట్ లాంటి వివరాలు ఇంకా వెల్లడిచేయలేదు. పోస్టర్ ను, టైటిల్ ను బట్టి చూస్తుంటే.. హనుమంతుడి అంశతో జన్మించిన హీరో చేసే విన్యాసాలతో ఈ సినిమా రూపొందుతోంది అనిపిస్తోంది.
నిజానికి తెలుగులో మొట్టమొదటి సూపర్ హీరో సినిమా ఏంటంటే.. యన్టీఆర్ హీరోగా వి.మధుసూదనరావు తెరకెక్కించిన ‘సూపర్ మేన్’ అని చెప్పుకోవాలి. ఈ సినిమా కూడా సరిగ్గా హనుమంతుడి అనుగ్రహంతో బలవంతుడిగా మారిన హీరో విన్యాసాలతో రూపొందింది. అయితే అది హాలీవుడ్ మూవీ సూపర్ మేన్ సినిమా నుంచి సూపర్ హీరో కేరక్టర్ తో రూపొందింది కాబట్టి.. ఇది ఒరిజినల్ సూపర్ హీరో సినిమా కాదని చెప్పాలి. మరి ఈ హనుమాన్ లో హీరో ఎవరవుతారో చూడాలి.
Must Read ;- దర్శకేంద్రుడి ‘పెళ్ళిసందD’ ఓటీటీలోనే.. నిజమేనా?