కొన్ని సినిమాలకు లొకేషన్సే ప్రాణం. కథాగమనానికి, పాత్రలకు ఒకోసారి అవే కీలకంగా మారతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సౌత్ లో కొన్ని సినిమాలు అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. కథను బట్టి ఆయా సినిమాలు అక్కడే షూటింగ్ జరుపుకోవాలి. అందుకే మన హీరోలంతా.. ఒకేసారి అడవులమీద పడ్డారు. తుపాకీలు, బాణాలు తదితర ఆయుధాలతో అరణ్యవాసం మొదలెట్టారు.
అడవుల నేపథ్యంలోనే రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’
దర్శక ధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ త్వరలోనే ఫ్రెష్ షెడ్యూల్ ను ప్రారంభించనుంది. తారక్, చెర్రీ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమా ప్రీ ఇండిపెండెన్స్ కథాంశంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అల్లురి సీతారామరాజు , కొరమరం భీమ్ పాత్రల స్ఫూర్తితో తెరకెక్కునున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు అడవుల్లోనే సాగుతుంది. ఎందుకంటే.. ఇద్దరూ మన్యం వీరులే. అప్పట్లో వారు అడవుల నుంచే పోరాటాన్ని సాగించారన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాకి అడవులే కీలకం కానున్నాయి.
రెండు సినిమాలతో రానా అరణ్యపర్వం
‘బాహుబలి’ తర్వాత రానా ‘నేను రాజు నేనే మంత్రి, యన్టీఆర్ సిరీస్, హౌస్ ఫుల్ 4 లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు. అయితే ఈ ఏడాదంతా రానా తదుపరి సినిమాలు చిత్రీకరణ దశలోనే ఉండిపోయాయి. లాక్ డౌన్ కారణంగా ఈ పాటికి విడుదలవ్వాల్సిన రెండు సినిమాలు .. పెండింగ్ లో పడిపోయాయి. అవి ‘అరణ్య, విరాటపర్వం’. ఈ రెండు సినిమాలు వేరు వేరు కథలతో తెరకెక్కినా.. ఈ రెండింటికి కామన్ పాయింట్ అడవులు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ హిందీ, తమిళ, తెలుగు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తోన్న సినిమా అరణ్య. బాలీవుడ్ క్లాసిక్ మూవీ ‘హాథీ మేరే సాథీ’ ప్రేరణతో అదే పేరుతో ప్రధానంగా బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగులో అరణ్య గానూ, తమిళంలో కాడన్ గానూ విడుదల కానుంది.
థియేటర్స్ తెరుకున్న వెంటనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా అంతా దాదాపు అడవుల్లోనే తెరకెక్కనుంది. అలాగే .. ఇందులో ఏనుగు కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇక రానా నటిస్తోన్న వేణు ఊడుగుల సినిమా ‘విరాట పర్వం’ సినిమా కూడా అడవుల నేపథ్యంలో సాగే సినిమానే . నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో 1992 లో జరిగిన పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సాయిపల్లవి, ప్రియామణి తో పాటు జాతీయ నటి నందితా దాస్ కూడా నటిస్తూండడం ఆసక్తి కలిగిస్తోంది. ఇక మూవీ చాలా వరకూ అడవుల్లోనే చిత్రీకరణ జరుపుకుంటోంది.
‘పుష్ప’ కూడా అడవుల్లోనే మకాం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’. రక్త చందనం స్మిగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా చాలా వరకూ చిత్తూరు లోని శేషాచలం అడవుల్లోనే చిత్రీకరణ జరుపుకోనుండడం విశేషం. ఇందులో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ గా ఓ డిఫరెంట్ మేకోవర్ తో అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు. ఇక ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మికా మందణ్ణ నటిస్తోంది.
‘అడవిపొలం’లో మెగా మేనల్లుడు
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ కథానాయకుడిగా నటిస్తోన్న రెండో సినిమా ఈ మధ్యనే మొదలయి.. రెగ్యులర్ షూటింగ్ కు కూడా వెళ్ళిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అడవిపొలం నవల ఆధారంగా రూపొందుతోంది. అదే టైటిల్ ను సినిమాకి కూడా ఫిక్స్ చేయబోతున్నారు. నవల కథాంశం ప్రకారం.. పాత్రలన్నీ అడవుల్లోనే సంచరిస్తుంటాయి. అడవుల చుట్టు పక్కల గ్రామాల్లో గొర్రెలు కాసుకొనే వారి జీవన విధానంపై ఈ సినిమా తెరకెక్కనుంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా పై టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి. మరి ఈ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.