ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి సుధ ఏకగ్రీవంగా ఎన్నికవుతారని అంతా అనుకున్నారు. చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సీటిస్తే.. మిగిలిన పార్టీలు పోటీకి దిగరాదన్న సంప్రదాయాన్ని గౌరవించిన టీడీపీ, జనసేనలు బరి నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించాయి. దీంతో దాసరి సుధ ఏకగ్రీవంగానే ఎన్నికవుతారన్న వాదనలు వినిపించాయి. అయితే గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని బీజేపీ బద్వేల్ బైపోల్ లో బరిలోకి దిగుతున్నట్లుగా సంచలన ప్రకటన చేసింది. తన అభ్యర్థిగా పనతల సురేశ్ ను ప్రకటించేసింది. అయితే బీజేపీ కంటే తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కూడా బద్వేల్ బైపోల్ బరిలోకి దిగేసింది. కడప జిల్లాకే చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కమలమ్మను తమ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఆమెతో నామినేషన్ కూడా వేయించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది.
సాకే షాకింగ్ కామెంట్స్
ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. కమలమ్మ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన సందర్భంగా ఏపీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలు అందరిలోనూ ఆసక్తి రేకెత్తించాయి. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘త్వరలో జరగబోవు బద్వేలు ఉప ఎన్నికలలో ఎన్ని వ్యూహాలు, పద్మవ్యూహలు పన్నినా కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి అటు టీడీపీ, ఇటు వైసీపీల పరిపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిని చూశాము. వీరి పాలనలో నవ్యాంధ్రప్రదేశ్ పరిస్థితి అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు చందంగా మారింది. బ్రహ్మ సాగర్ పూర్తి అయిన ఈరోజు బద్వేల్ నియోజకవర్గనికి సాగునీరు, తాగునీరు అందుతున్నాయంటే అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క పుణ్యమేనని ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ విజయం తధ్యం. గతంలో కడప జిల్లా అభివృద్ధి జరిగడానికి తోడ్పడింది కేవలం కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడున్న వైసీపీ కేవలం ప్రజలకు రోడ్లను కూడా వేయలేని దుస్థితిలో ఉంది. కేవలం ముఖ్యమంత్రి కావాలని అయ్యారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది’’ అని సాకే ఓ రేంజిలో చెప్పుకుపోయారు.
దొందూ దొందే కదా
అటు బీజేపీ అయినా, ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా ఏపీ రాజకీయాల్లో జీరో స్థాయిలో ఉన్న పార్టీలే కదా. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్నిచేపట్టినా.. తన హయాంలోనే రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా ముద్ర వేయించుకుని కాంగ్రెస్ పార్టీ జీరో స్థాయికి పడిపోయింది. ఈ కారణంగానే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కొన్ని సీట్లను సాధించిన హస్తం పార్టీ ఏపీలో సింగిల్ సీటును కూడా దక్కించుకోలేకపోయింది. ఇక 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అదే తరహా పరాభవం తప్పలేదు. ఆ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన హేమాహేమీలు కూడా ఓటమిపాలయ్యారు. ఇక బీజేపీ విషయానికి వస్తే.. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా ఓ ఎంపీ సీటును, రెండు ఎమ్మెల్యే సీట్లను దక్కించుకున్నబీజేపీ.. 2019 ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి సింగిల్ సీటునూ దక్కించుకోలేకపోయింది. వెరసి విజయంపైనే కాకుండా మెజారిటీని కూడా తగ్గించే శక్తి లేని ఈ రెండు పార్టీల బరితో వైసీపీకి పెద్దగా నష్టం జరగదన్నవాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ఓడిపోతామని తెలిసీ పోటీ చేస్తారా?