కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే ఆనందం కంటే.. దాని వల్ల ఏవైనా దుష్ఫలితాలు వస్తాయోమోనన్న అనుమానాలతో జనాలు భయపడుతున్నారు. ఎన్నెన్నో అనుమానాలు వారి బుర్రలను తొలిచేస్తున్నాయి. వారి భయాలకు తగ్గట్టు వ్యాక్సిన్ వల్ల చనిపోయారంటూ మీడియాలో వస్తున్న పలు కథనాలు వారి భయాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. అసలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవలసి వస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలివిగో..
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది?
వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం మిమ్మల్ని వెంటనే ఇంటికి పంపరు. ఒక 30 నిమిషాల నుండి గంట పాటు మీ ఆరోగ్య పరిస్థితి గమనిస్తారు. వ్యాక్సిన్‌కి ముందు మీ ఉష్ణోగ్రత, తర్వాత ఎలా ఉన్నాయో నమోదు చేస్తారు. అలాగే ఓ గంట తర్వాత ఉష్ణోగ్రతలు కూడా నమోదు చేస్తారు. అప్పటి మీ ఆరోగ్య స్థితి సాధారణంగానే ఉంటే మిమ్మల్ని ఇంటికి పంపుతారు.
Must Read ;- ఏపీలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత
ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
వ్యాక్సిన్ వేసిన దగ్గర ఎర్రబారడం, వాపు, నొప్పి, జ్వరం, మత్తుగా ఉండటం లాంటివి ఎదుర్కోవలసి వస్తుంది. చాలా అరుదుగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. 102 డిగ్రీల కంటే ఎక్కువగా జ్వరం రావడం, ప్రాణాంతకంగా మారడం, అలర్జీ వంటివి వస్తాయి. ఇలాంటి తీవ్రమైన సమస్యలు వచ్చినపుడు వెంటనే వ్యాక్సిన్ ఇచ్చిన వాలంటీర్లకు తెలియజేసి, ఆసుపత్రిలో చేరాలి.
కొవ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
కొవ్యాక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్ వారందంచిన సమాచారం ప్రకారం, ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి తీవ్రమైన సమస్యలు ఉండవు. ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర నొప్పి, కడుపులో నొప్పి, జ్వరం, మత్తుగా ఉండడం, నీరసం, చమట పట్టడం, తలనొప్పి, దగ్గు.. ఇలాంటి చిన్నపాటివి మాత్రమే వస్తాయని పేర్కొన్నారు.
కొవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వారు పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర దురద, నొప్పి, తలనొప్పి, నీరసం, ఇబ్బందిగా అనిపించడం.. లాంటివి ఉండచ్చని పేర్కొన్నారు. చాలా అరుదైన సందర్భాల్లో తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని తామిచ్చిన డేటాలో రాసుకొచ్చారు.
Also Read ;- ఏ వ్యాక్సిన్ ఎన్నేళ్లు రక్షించగలదు?
వ్యాక్సిన్ తీసుకన్న తర్వాత ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఏం చేయాలి?
వ్యాక్సిన్ ఇస్తున్న కేంద్రంలో తప్పకుండా ఆరోగ్య నిపుణులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వ్యాక్సిన్ అందిస్తున్న వారు, వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే అక్కడికక్కడే ప్రాధమిక చికిత్స అందించాలి. ఆ తర్వాత పేషంట్‌ని అక్కడి నుండి మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రికి వెంటనే తరలించే ఏర్పాట్లు చేయాలి.
ప్రతి ఒక్కరూ సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవలసిందేనా?
వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరిలో చిన్న చిన్న సమస్యలు మామూలే అంటున్నారు నిపుణులు. కేంద్రం అందిస్తున్న డేటా ప్రకారం, మొదటి 3 రోజుల్లో 580 మందికి కాస్త తీవ్ర సమస్యలు వచ్చినట్టు చెప్తున్నారు. అందులో కేవలం 7 మంది మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు.
Also Read ;- పుణెలోని సీరంలో భారీ అగ్నిప్రమాదం
వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
దీనిపై కొంత స్పష్టత కరువైనా.. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ పెట్టుకోవడం, చేతులు శుభ్రం చేసుకోవడం.. లాంటి కరోనా రూల్స్ కచ్చితంగా పాటించాలని చెప్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వచ్చినా వారిపై ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, వారి నుండి ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించక తప్పదంటున్నారు నిపుణులు.
వ్యాక్సిన్ తీసుకన్న కొంత కాలం తర్వాత ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఏం చేయాలి?
వెంటనే డాక్టర్లను సంప్రదించండి. అంతేకాదు, వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రానికి మీ ఆరోగ్య సమస్య గురించిన సమాచారం అందించండి. అలా చేయలేని పరిస్థితులు ఉంటే 1075కి ఫోన్ చేసి సమాచారం అందించి మీ ఆరోగ్య సమస్య నమోదు చేసుకునేలా వివరించండి.
ఎన్ని డోసులు తీసుకోవాలి?
ఏ వ్యాక్సినైనా.. రెండు డోసులు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు పూర్తి కావాలి. మొదట ఏ వ్యాక్సిన్ డోసు తీసుకుంటున్నారో.. అదే వ్యాక్సిన్‌ని రెండో డోసు కూడా తీసుకోవాలి. ఉదాహరణకు మొదటి డోసు కొవ్యాక్సిన్ తీసుకుంటే.. రెండో డోసు కూడా కొవ్యాక్సిన్ మాత్రమే తీసుకోవాలి. రెండో డోసు వేరేది తీసుకోవడానికి కుదరదని కేంద్రం కచ్చితమైన నిబంధన విడుదల చేసింది.