ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, EVMలలో ట్యాంపరింగ్ జరిగింది అంటూ కూటమి విజయంపై వైఎస్ జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారానికి ఈ ఫలితాలు చెక్ పెట్టాయి. ఎందుకంటే, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగింది ఈవీఎంలతో కాదు, పక్కా బ్యాలెట్ పేపర్లతో! బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ జరిగినా సరే ప్రజలు కూటమికే బ్రహ్మరథం పట్టారు.
తాజా మున్సిపల్ ఫలితాల్లో మొత్తం 100 స్థానాలకు గాను కూటమి ఏకంగా 93 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. ఇక వైఎస్సార్సీపీ కేవలం 4 స్థానాలకే పరిమితం కాగా, ఇతరులు 3 చోట్ల గెలిచారు. ఈ రికార్డు స్థాయి విజయం ఏపీ రాజకీయాన్ని మరో మలుపు తిప్పడమే కాకుండా, అధికార కూటమి గ్రాఫ్ ఇంకా ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టింది.
ఇక్కడ అసలు విశేషం ఏంటంటే..ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల దెబ్బ ఢిల్లీ దాకా తాకింది. ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం ఈ అవకాశాన్ని పొలిటికల్ అస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి బీజేపీ ఈ ఫలితాలను ఆయుధంగా వాడుకుంటోంది. ఇక్కడ నిందించడానికి ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లలోనూ ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది అంటూ బీజేపీ జాతీయ సోషల్ మీడియా వేదికలపై ట్వీట్లు చేస్తూ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది.
ఏపీలో బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేస్తే వచ్చిన ఈ సునామీ దెబ్బకి YCPకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఓటమికి కారణం ఈవీఎంలు కావని, ప్రజల్లో కూటమి పట్ల ఉన్న నమ్మకం, తమ పట్ల ఉన్న వ్యతిరేకత అని జగన్‌కి ఇప్పటికైనా గట్టిగా అర్థమై ఉంటుంది. మొత్తానికి, ఏపీలో వచ్చిన ఈ బ్యాలెట్ ఫలితం కూటమికి తిరుగులేని శక్తినే కాదు, ఢిల్లీలో విపక్షాల నోళ్లు మూయించడానికి బీజేపీకి బ్రహ్మాస్త్రాన్ని అందించింది











