TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా లోకేశ్‌కు పార్టీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు అప్పగించింది. ఇది కేవలం ఒక పదవి మాత్రమే కాదు, భవిష్యత్ నాయకుడిగా లోకేష్‌ను రెడీ చేసే దిశగా పార్టీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా 2019-24 మధ్య కాలంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అధికార పక్షం నుంచి ఎదురైన దాడులు, అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో లోకేశ్ చూపిన చొరవ అమోఘం. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి, 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి బలమైన పునాది వేశారు..
కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా, ఢిల్లీ స్థాయిలోనూ లోకేశ్ ఇప్పుడు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి జాతీయ నేతలతో నిరంతరం టచ్‌లో ఉంటూ, భవిష్యత్ నేతగా వారి గుర్తింపు పొందారు. మరోవైపు, ఐటీ మంత్రిగా గూగుల్, ఆర్సెలార్ మిత్తల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించడంలో లోకేష్ చేసిన కృషి రాష్ట్రానికి కొత్త ఊపిరి పోసింది. అటు పార్టీని, ఇటు పాలనను సమన్వయం చేసుకుంటూ వెళ్తున్న తీరు లోకేష్ పరిణతికి నిదర్శనం..
లోకేశ్ నాయకత్వంలో TDP ఇప్పుడు కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని అక్షరాలా అమలు చేస్తోంది. పదవుల కేటాయింపులో సీనియారిటీ కంటే పనితీరుకే పెద్దపీట వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక క్లస్టర్ ఇన్‌ఛార్జిని, ఒక మండల స్థాయి మహిళా నేతను పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా లోకేశ్ రాజకీయాల్లో కొత్త సంస్కృతికి తెరలేపారు. పని చెప్పేవారికి కాదు..పనిచేసే వారికే పదవులు” అనే మాటను ఆచరణలో చూపిస్తూ, క్షేత్రస్థాయి నాయకులను సైతం ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు..
రాబోయే 30-40 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, యువతకు ప్రాధాన్యం ఇస్తూనే సీనియర్ల అనుభవాన్ని గౌరవించే సరికొత్త నాయకత్వాన్ని లోకేశ్ సిద్ధం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున సీనియర్లను కాదని, సామాన్య కార్యకర్తలను వేదికపై కూర్చోబెట్టడం ద్వారా పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. జాతీయ, రాష్ట్ర కమిటీల కూర్పులో తనదైన ముద్ర వేస్తూ, TDPకి కొత్త శైలిని, సరికొత్త శక్తిని అందిస్తున్న లోకేశ్..రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదగబోతున్నారనడంలో అనుమానం అవసరం లేదు..











