ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం కేరళ. నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది ఈ రాష్ట్రం. ఇప్పటికే ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్తగా మరో సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
కేరళ ప్రభుత్వం కొత్తగా వాటర్ ట్యాక్సీలను అందుబాటులోనికి తీసుకు వచ్చినట్లు ప్రకటించింది. తెప్పలతో ఆధునికంగా రూపొందించిన వీటి సేవలను ముందుగా అలప్పుజ రేవులోనికి తీసుకుని వచ్చింది. డీజిల్ ఇంధనంతో కదిలే దీనిలో సుమారు 10 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. గంటకు దాదాపు 30 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటిలో ప్రయాణం చౌకతో పాటు సురక్షితం కూడా అని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పేర్కొన్నారు.
దీని వలన కేరళ పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. దీనితో పాటు ప్రయాణికులకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు.
అయితే ఈ సౌకర్యాన్ని కేరళలో కల్పించిన తరువాత కొందరు ఉత్సాహవంతులు సోషల్ మీడియాలో తమ ప్రతిభను చూపించేస్తున్నారు.
చార్మినార్ టు టోలీ చౌక్…
ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కొందరు ఔత్సాహికులు తమ టాలెంట్ అంతా ఉపయోగించేసి కొన్ని మీమ్స్ తయారు చేశారు. అందులో ఉబర్ సంస్థ తన సంస్థ తరుఫున చార్మినార్ నుంచి టోలిచౌక్ వరకు తమ బోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు తయారు చేశారు. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయ్యింది.
ఏదీ ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఐడియా సూపరంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.