బళ్లారిని..ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన గాలి జనార్ధన్ రెడ్డి..ఇప్పుడు భయపడిపోతున్నారు. తనపై హ*త్యాయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి మధ్య తాజాగా ఫ్లెక్సీల విషయంలో ఘర్షణ తలెత్తింది. రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా..మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యయి.
వివాదం ఏంటి..!
బళ్లారి SP సర్కిల్‌లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని జనవరి 3, 2026న ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ప్రధాన అనుచరుడు సతీష్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి నివాసం ప్రహరీ గోడకు ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించారు. తమ నాయకుడి ఇంటి వద్ద ఫ్లెక్సీలు కట్టవద్దని గాలి అనుచరులు గొడవకు దిగారు. ఇది తీవ్ర స్థాయికి చేరింది. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే గాలి జనార్ధన్ రెడ్డి అక్కడకు చేరుకోవడం వివాదం మరింత ముదిరింది. కాల్పులు కూడా జరిగాయి. ఈ కాల్పుల్లో బళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుడు ప్రాణాలు కోల్పోయాడు. భరత్ రెడ్డి ప్రధాన అనుచరుడు సతీష్ రెడ్డికిసైతం తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనను బెంగళూరుకు తరలించారు. గాలి జనార్ధన్ రెడ్డి పేల్చిన బుల్లెట్ వల్లే తన అనుచరుడు మ*రణించాడని, మరో అనుచరుడికి తీవ్ర గాయాలయ్యాయని భరత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫ్యామిలీకి గాలి జనార్ధన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ హయాంలో గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి భారీగా మైనింగ్ లీజులు దక్కాయి. వైఎస్సార్‌ను తండ్రి లాంటి వ్యక్తిగా, జగన్‌ను తన తమ్ముడిగా చెప్పుకుంటారు గాలి జనార్ధన్ రెడ్డి. అయితే, 2009లో వైఎస్సార్ మ*రణం తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. 2011లో CBI అక్రమ మైనింగ్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేయడంతో గాలి రాజకీయ పతనం ప్రారంభమైంది. దాదాపు 4 ఏళ్ల పాటు జైలులో గడిపిన తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చినా, కోర్టు ఆంక్షలతో తన సొంత జిల్లా బళ్లారికి వెళ్లేందుకు కూడా ఆయనకు సుదీర్ఘకాలం అనుమతి దొరకలేదు. 2023 ఎన్నికల ముందు కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీ స్థాపించి 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీలో విలీనం చేసి తిరిగి తన మాతృసంస్థలో చేరారు. రాజకీయంగా, ఆర్థికంగా పూర్వ వైభవం కోసం పోరాడుతున్నారు గాలి జనార్ధన్ రెడ్డి.











