(విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
విశాఖ రాజకీయ చదరంగంలో మరో పావు ముందుకు కదిలేందుకు మరికొంత సమయం పట్టేట్టుంది. అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీలోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేరికపై గత కొంత కాలంగా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆయన వైసీపీ తీర్థం తీసుకుంటారని అనేక మార్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, ఆగస్టులో ఆయన పార్టీలో చేరడం ఖాయంగా కనిపించింది. 16వ తేదీ ముహూర్త నిర్ణయం జరిగినట్లుగా పుకార్లు వచ్చాయి కూడా. కానీ ఆఖరి నిమిషంలో ఈ ప్రయత్నం కూడా వాయిదా వేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.
కారణమేంటి?
ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేరికను టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు వర్గం గట్టిగా వ్యతిరేకిస్తుండగా, అదే పార్టీ లోని కొందరు కార్యకర్తలు, నాయకులు గంటా రాకను స్వాగతిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు నుంచే వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. భీమిలి నియోజకవర్గం సీటు కోసం ప్రారంభంలో వీరిద్దరూ పోటీపడడం ఆఖరి నిమిషంలో గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. అనంతర పరిణామాలు అందరికీ తెలిసిందే. పార్టీలు మారినా, నియోజకవర్గాలు మారినా.. అంతిమంగా మంచి హోదాలో కొనసాగడం గంటాకు అలవాటుగా మారింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కేవలం ఎమ్మెల్యే గా కొనసాగుతున్న ఆయన ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని స్పష్టమవుతోంది.
ఈ దశలోనే ఆయన వైఎస్సార్సీపీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా ప్రారంభం నుంచి ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రచారం మాట ఎలా ఉన్నా, ఇటీవల కాలంలో వైఎస్సార్సీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్న వాస్తవం అధికార పక్షంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ రూఢి అయ్యింది. దానికి తగ్గట్టుగానే గంటా శ్రీనివాసరావు గత ఏడాది కాలంగా తెలుగుదేశానికి పూర్తి దూరంగా మెలగుతున్నారు. ఇక గంటా వైకాపాలో చేరడం తథ్యం అనుకున్న తరుణంలో అందుకు బ్రేకులు వేయడంలో మంత్రి ముత్తంశెట్టి వర్గం సఫలమైంది.
భీమిలి నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు అనేకం నిర్వహించారు. ఈ పరిణామాలు- చేరికను తాత్కాలికంగా వాయిదా వేసేందుకు కారణమయ్యాయి.
దీంతో పాటు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీ అధిష్టానం ముందు గంటా మేనల్లుడి భూ వ్యవహారాన్ని ఉంచడం కూడా అందుకు మరో కారణంగా చెబుతున్నారు. ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే భవిష్యత్తులో పార్టీకి చెడ్డపేరు తప్పదు అన్న వాదన బలంగా వినిపించినట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ తీర్థం తీసుకోవడం సరికాదని గంటా వర్గం వాయిదా ధోరణిని ఆశ్రయించింది.
మంత్రిపై క్యాడర్లో వ్యతిరేకత?
ఇదిలా ఉండగా అధికార పార్టీలో భీమిలి నియోజకవర్గం కేడర్లో ఒక వర్గం పూర్తిగా గంటా రాక కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రి ముత్తంశెట్టి కార్యకర్తలతో వ్యవహరిస్తున్న తీరు ఇందుకు కారణంగా చెబుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఆగ్రహించడం, కక్షపూరితంగా వ్యవహరించడం, వ్యక్తిగత కారణాలతో కార్యక్రమాలకు హాజరు కాలేకపోయిన వారిపై చిందులు వేయడం ఓ వర్గం లో మంత్రి పట్ల అయిష్టతకు కారణమవుతోంది.
మంత్రిగారి ఆగ్రహం ఎంతవరకు వెళ్లిందంటే… ఓ సందర్భంలో కార్యకర్త పై చేయి చేసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తున్న మంత్రితో వేగ లేమని, గంటా వస్తే ఆయనకు చెక్ పెట్టొచ్చని ఓ వర్గం భావిస్తోంది. అంతేకాకుండా రాజకీయంగా స్థానిక ఎన్నికల్లో గెలిపించగల సత్తా కూడా గంటాకు మాత్రమే ఉందని మెజారిటీ కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు.
భీమిలి నియోజకవర్గంలో పని చేసిన అనుభవం ఇద్దరికీ ఉండడంతో అటు అవంతికి, ఇటు గంటాకు తమకంటూ ప్రత్యేక కేడర్ ఉంది. వైఎస్సార్సీపీలో క్యాబినెట్ హోదా హామీతోనే గంట పార్టీ మారుతారు అని ప్రచారంలో ఉంది. అదే జరిగితే రానున్న రోజుల్లో మంత్రి ముత్తంశెట్టి వర్గానికి ఎదురుదెబ్బ తప్పదని గంటా వర్గం భావిస్తోంది. ఈ ఆసక్తికర పరిణామాలు కార్యరూపం దాల్చేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది.