‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్ ఓ సరికొత్త డిమాండ్ లేవనెత్తారు. క్రికెట్ లో వివాదాస్పదమైన అవుట్ కు పేరు మార్చాలని కోరారు. ఇప్పటివరకు మన్కడింగ్ గా పిలుస్తున్న ఆ విధానాన్ని బ్రౌనింగ్ అంటూ పిలవాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దశబ్దాలుగా క్రికెట్ లో ఎన్నో మార్పులు జరిగాయని కానీ మన్కడింగ్ పేరు మాత్రం మారలేదని అభ్యంతరం తెలిపారు. భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ పేరును ఈ వివాదాస్పద అవుట్ కు వాడటం సరికాదని హితువు పలికారు. లెజెండ్ డాన్ బ్రాడ్మన్ కూడా ఈ విధానం తప్పుకాదని చెప్పిన సంగతిని గవాస్కర్ గుర్తు చేశారు.
మన్కడింగ్ పేరు ఎలా వచ్చింది
నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న ఆటగాడు బాల్ డెలివరీ చేయకముందే క్రీజు వదిలితే బౌలర్ అవుట్ చేసే విధానాన్ని మన్కడింగ్ అని పిలిచే సంగతి తెలిసిందే. 1947, ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ వివాదం మొదలయింది. ఆసీస్ క్రికెటర్ బిల్ బ్రౌన్ పదే పదే క్రీజు దాటడంతో వినూ మన్కడ్ అతనిని అవుట్ చేశాడు. దీంతో ఆసీస్ మీడియా మొత్తం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అవుట్ విధానానికి మన్కడింగ్ పేరు పెట్టారు. ఈ ఘటన జరిగి 70 సంవత్సరాలు దాటినా ఆ పేరునే పిలుస్తున్నారు.
గత అనుభవాలు
1947లో జరిగిన ఈ వివాదాన్ని అందరూ మరచిపోయారు. కానీ 1987 ప్రపంచ కప్ లో పాకిస్తాన్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తో మన్కడింగ్ వివాదం మరోమారు రేగింది. కీలకమైన ఆ మ్యాచ్ లో వాల్ష్ పదే పదే క్రీజు దాటి వెళుతున్న పాక్ ఆటగాడిని ఔట్ చేయకుండా హెచ్చరించి వదిలేశాడు. 1992లో కపిల్ దేవ్ కూడా సౌత్ ఆఫ్రికా ఓపెనర్ పీటర్ కిరస్టన్ ను హెచ్చరించి వదిలివేశాడు. 1999లో ఇండియా ఆటగాడు జడేజాని కూడా షేన్ వార్న్ కూడా మన ఆటగాడు జడేజాని హెచ్చరించి వదిలిపెట్టాడు. 2008లో అశ్విన్ బాల్ డెలివరీ కాకముందే క్రీజు దాటడంతో అవుట్ చేశాడు. కానీ క్రీడా స్ఫూర్తితో సచిన్ టెండూల్కర్ అంపైర్ తో మాట్లాడి ఆ ఆటగాడిని తిరిగి వెనుకకు పిలిపించాడు.
ఐపీఎల్ లో తిరిగి మొదలు
ఇండియన్ క్రికెట్ లీగ్ లో ఈ వివాదం అశ్విన్ తోనే వెలుగులోకి వచ్చింది. గత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్ క్రీజు దాటడంతో అశ్విన్ మన్కడింగ్ అవుట్ చేశాడు. దీంతో అశ్విన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని విమర్శలు వెల్లువెత్తాయి. కానీ తాను చేసింది తప్పు కాదని అశ్విన్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు. తాజా సీజన్ లో కూడా అశ్విన్-బట్లర్ ల మధ్య ఈ వివాదంపై మాటల తూటాలు పేలాయి. అంత సర్దుకుందని భావిస్తున్న సమయంలో మరొకమారు ఈ అనుభవం ఎదురయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఆరోన్ ఫించ్ క్రీజు దాటి వెళ్లడంతో అశ్విన్ హెచ్చరించి వదిలేశాడు. దీంతో ఈ విధానంపై క్రీడా వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
గవాస్కర్ సూచనలు
బౌలర్ మన్కడింగ్ ద్వారా అవుట్ చేయడం తప్పుకాదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ పద్దతిని మన్కడింగ్ అని కాకుండా బ్రౌనింగ్ అని పిలవాలని కోరారు. ఇండియన్ క్రికెట్ దిగ్గజం మన్కడ్ పేరిట ఈ అవుట్ విధానం కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్ని జరిగినా ఆసీస్ ఆటగాళ్లు మారారని తాజాగా జరిగిన ఫించ్ విషయాన్ని గుర్తు చేశారు. బ్రాడ్మన్ కూడా ఈ విధానం తప్పుకాదని చెప్పారని గవాస్కర్ పేర్కొన్నారు. కానీ గవాస్కర్ ఎత్తుకున్న ఈ డిమాండ్ పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. తొందరపాటు, నిబంధనలు అతిక్రమించే అతివాదం, పొరబాటు, పరుగు చేసేయాలనే ఆత్రుత ఏదైనా కావచ్చు. కానీ తప్పు తప్పే! తప్పుచేసిన వాడి పేరు కాకుండా, ఇంకో పేరు పెట్టడం కరెక్టు ఎలా అవుతుందంటూ క్రీడా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం గవాస్కర్ చెప్పినట్లు అవుట్ విధానానికి పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.