ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. అయితే వీటికి సంబంధించిన ఏర్పట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు 30 కేంద్రాల్లో జరగనుంది. ఇందుకు గ్రేటర్‌లోని ప్రతి సర్కిల్ వారిగా హాళ్లను సిద్ధం చేస్తున్నారు అధికారులు. మొత్తం 150 పెద్ద హాల్స్‌లను ఏర్పాటు చేస్తారు. ఓట్ల లెక్కిపు కోసం ఒక హాల్‌కి 14 టేబుల్స్, ప్రతి టేబుల్‌కు ప్రత్యేక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ సిబ్బంది ఉండనున్నారు.
ఈ కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం 8152 సిబ్బంది పాల్గొంటున్నారు. దీంతోపాటు అదనంగా మరో 31 కౌంటింగ్ పరిశీలకులుగా ఉంటారు. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియనంతా సీసీ టీవీలతో చిత్రీకరించనున్నారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఒక రౌండ్లో దాదాపు 14వేల ఓట్లను లెక్కిస్తారు. కరోనా ముందస్తు జాగ్రత్తలో భాగంగా అధికారులు, కౌంటింగ్ సిబ్బంది అందరూ తప్పనిసరిగా మాస్కును ధరించేలా నిబంధనలు పెట్టారు. అలాగే ప్రతి టేబుల్ దగ్గర శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు.
ఫస్ట్ ఫలితం మెహిదీపట్నమే…
150 డివిజన్లకు కౌంటింగ్ జరగనుంది. ఇందులో మొదట ఫలితం వెలువడేది మెహిదీపట్నందైతే చివరగా మైలార్‌దేవ్‌పల్లి డివజన్ ఫలితం వెలువడనుంది. దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు గెలుపెవరిదనే దానిపై ఒక స్పష్టత రానుంది. ఈ గ్రేటర్ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా 74,04,288 ఓట్లు ఉండగా అందులో 34,50,331 ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. పాత మలక్‌పేట్ డివిజన్ మినహా 18 లక్షల 60 వేల 40 మంది పురుష ఓటర్లు, 15 లక్షల 90 వేల 219 మంది మహిళా ఓటర్లు డిసెంబర్ 1న జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1122 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచల భద్రతను పోలీసు శాఖ ఏర్పాటు చేసింది.
Must Read ;- 6 తరువాతే ఎగ్జిట్ పోల్స్… ఆ ఫలితాలపై నేతల ఆసక్తి!