నేటితో గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం ఆరుగంటల వరకు ప్రచారానికి గడువు మాత్రమే ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారంలో స్పీడ్ పెంచేశాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా కొన్ని గంటలే మిగలి ఉండడంతో నేతలు బస్తీల బాటపట్టారు. ఇంటింటికీ తిరిగి తమకే ఓటు వేయాలని జనాలను అభ్యర్థిస్తున్నారు. రోడ్ షోలతో తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
ఈ రోజు సాయంత్రం వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం చేసుకోవాలని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. సాయంత్రం 6 గంటల తరువాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్ల జైలు లేదా జరిమానా విధించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించే వీలులేదు. మద్యం షాపులు కూడా ఈ రోజు నుంచి మూతపడనున్నాయి. ప్రచారానికి గడువు ముగిసిన వెంటనే మద్యం అమ్మకాలపై నిషేధాజ్ఞలు అమలులోకి వస్తాయి. అలాగే టీవీల ద్వారా ప్రసారాలు చేయకూడదని ఎసీఈసి తెలిపింది.
ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసినాక జీహెచ్ఎంసీ పరిధిలో లేని రాజకీయ నాయకులు, నివాసం లేని వారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ ఉండకూడదు. తమతమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. కేవలం పోలింగ్ రోజున మాత్రమే అభ్యర్థికి ఒక వాహనం అనుమతి ఉంటుంది. దానికి కూడా సంబంధిత డివిజన్‌లో మాత్రమే అనుమతి ఉంటుంది. వాహనానికి సంబంధించిన అనుమతి పత్రం ఆ వాహనానికి అతికించవలసి ఉంటుంది. ఈ వాహనంలో అభ్యర్థికి, తన ఏజెంట్ తప్పా తిరిగే అనుమతిలేదు. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 4న కౌంటింగ్ ఉండనుంది.