బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా కోసం ‘మోనార్క్‘ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. దాదాపు ఈ టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే గతంలోను బాలకృష్ణ సినిమాకి సంబంధించి ఈ టైటిల్ వినిపించింది. కానీ అప్పట్లో వేరే టైటిల్ ను సెట్ చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు అదే టైటిల్ పరిశిలీస్తున్నట్టు తెలుస్తోంది.
సరే .. ఏదేమైనా ఇది పవర్ఫుల్ టైటిల్ అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ టైటిల్ ఖరారు అయితే బాలకృష్ణ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతారనే చెప్పొచ్చు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో, బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ రెండు పాత్రలు కూడా పూర్తి వైవిధ్యభరితంగా ఉంటాయని అంటున్నారు. ఒక పాత్రలో కలెక్టర్ గా బాలకృష్ణ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా కొత్తగా అనిపిస్తుందనీ, మరో పాత్రలో బాలకృష్ణ లుక్ పూర్తి డిఫరెంట్ గా అనిపిస్తుందని అంటున్నారు.
సహజంగానే బాలకృష్ణ సినిమాల్లో పాటలు జోరుగా .. హుషారుగా మాస్ ఆడియన్స్ మెచ్చేలా ఉంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా పాటలు పసందుగా సాగుతాయని చెబుతున్నారు. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడని అంటున్నారు. మే 28వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘సింహా’ .. ‘లెజెండ్’ సినిమాలు సంచలన విజయాలను సాధించడంతో, ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మరి ఈ ‘గాడ్ ఫాదర్’ ఆ అంచనాలను ఎంతవరకూ అందుకుంటాడనేది చూడాలి.
Must Read ;- యాక్షన్.. ఎమోషన్స్ నేపథ్యంలో బాలయ్య చిత్రం