జనసేన పార్టీ నేటి నుంచి 32 నియోజకవర్గాల్లో రెండో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెడుతోంది. అయితే మిగతా పార్టీల మాదిరి ఐదు, పది రుసుములు పెడితే, నాయకులే డబ్బు చెల్లించి, లక్ష మందిని చేర్పించాం. రెండు లక్షల మందిని క్రియాశీలక సభ్యులను చేర్పించామని జెబ్బలు చరుకుంటున్నారు. కానీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పిలుపు ఇచ్చే కదలి వచ్చే కార్యకర్త కనిపించడం లేదు. దీనిపై బాగా అధ్యయనం చేసిన జనసేనాని కనీసం రూ.500 క్రియాశీలక సభ్యత్వ రుసుము వసూలు చేసి, వారికి ప్రమాద బీమా రూ.5 లక్షలు కల్పించాలని నిర్ణయించారు. జనసేనాని నిర్ణయాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. కానీ పవన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తే పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో మరింత జోష్ పెంచేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
Must Read:-కేసీఆర్ స్కెచ్ ప్రకారమే.. జనసేన బరిలో ఉంటోందా?
సమయం లేదు మిత్రమా?
వకీల్ సాబ్ సినిమా 45 రోజులు ఏకదాటిగా షూటింగ్ జరుపుకోవడానికి జనసేనాని కాల్ షీట్స్ ఇచ్చారు. అయితే రెండు రోజులు అత్యవసర అనుమతి తీసుకుని 17,18 తేదీల్లో మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశాలు నిర్వహించారు. ఇవాళ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అందుకే జనసేనాని హడావుడిగా బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ రెండో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించలేకపోయారని తెలుస్తోంది. జనసేన పార్టీ పొలిటికల్ వ్యవహారాల ఇంఛార్జ్ నాందెడ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని ఆ పార్టీ మీడియా విభాగం ప్రకటించింది.
రుసుము భారీగా ఉంచింది అందుకే
5,10 రూపాయల రుసుము పెడితే స్థానిక నాయకులు పోటీలు పడి వారి సొంత డబ్బుతో రుసుములు చెల్లించి లక్షలాది మందిని క్రియాశీలక సభ్యత్వం చేయిస్తున్నారు. దీని వల్ల మాకు 50 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. మాకు కోటి మంది ఉన్నారని చెప్పుకోవడానికే పనికి వస్తుంది. కానీ పార్టీ ఏదైనా కార్యక్రమం తీసుకుంటే మాత్రం ఒక్కరు దొరకడం లేదు. అందుకే బాధ్యత, నిబద్దత ఉన్న వారికే క్రియాశీలక సభ్యత్వం ఇవ్వాలని జనసేన నిర్ణయించిందని తెలుస్తోంది. జనసేన సిద్దాంతాలు నచ్చి, ప్రజాసమస్యలపై గళమెత్తేవారినే క్రియాశీలక సభ్యులుగా తీసుకుంటామని ఆ పార్టీ ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గానికి 500 నుంచి 1000 మంది నికార్సయిన జనసైనికులను తయారు చేయాలనే ఉద్దేశంతోనే రుసుము రూ.500 చేశామని నాందెడ్ల మనోహర్ వెల్లడించారు.