‘మహానటి’ తర్వాత అందాల కీర్తి సురేష్ తన స్టైలే మార్చేసింది. అంతకు ముందులా స్టార్ హీరోల సరసన గ్లామర్ వేషాలు వేయడం మానేసి.. లేడీ ఓరియెంటెడ్ కథాంశాలపై దృష్టి సారించింది. ఆ కోవలోనే ఆ బ్యూటీ.. ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ లాంటి సినిమాలకు కమిట్ అయింది. అలాగే మలయాళంలో మోహన్ లాల్ తో ‘మరక్కార్ అరబ్బిక్కడలిండే సింహం’ అనే మూవీలోనూ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తోంది.
తాజాగా కీర్తి మరో లేడీ ఓరియెంటెడ్ మూవీతో రాబోతోంది. సినిమా పేరు ‘గుడ్ లక్ సఖి’. ‘లక్ష్మి, ధనిక్’ లాంటి సినిమాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నగేష్ కుకునూర్ ఈ సినిమాకి దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేశారు. తెలుగు టీజర్ ను ప్రభాస్ విడుదల చేయగా.. తమిళ టీజర్ ను విజయ్ సేతుపతి, మలయాళ టీజర్ ను పృధ్విరాజ్ సుకుమార్ విడుదల చేశారు.
ఎలా ఉంది: ‘గుడ్ లక్ సఖి’ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఒక పల్లెటూరులో అల్లరి వేషాలేస్తూ ఆడుతూ తుళ్ళుతూ తిరిగే మట్టిలో మాణిక్యం లాంటి ఒక అమ్మాయి.. సొంత ఊళ్ళో బ్యాండ్ లక్ గాళ్ గా ముద్రపడుతుంది. చివరికి ఆమె భారతదేశం గర్వించదగ్గ షూటర్ గా ఎదిగి గుడ్ లక్ గాళ్ అనిపించుకోవడమే ఈ సినిమా థీమ్. అయితే ఇదే స్టోరీ లైన్ తో గతంలో వచ్చిన శోభన్ బాబు ‘కార్తీక పౌర్ణమి’, జంధ్యాల ‘ఆనందభైరవి’, అశ్వనీ నాచప్ప బయోపిక్ ‘అశ్వని’, వెంకటేశ్ ‘గురు’ చిత్రాలు మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కీర్తి అదే కథాంశంతో షూటర్ గా నటించనుండడం ఆసక్తి కలిగిస్తోంది.
ఇక ఇందులో కీర్తి సురేశ్ మరోసారి నటనకు మంచి స్కోపున్న పాత్ర పోషిస్తోంది. కాగా.. ఆదిపినిశెట్టి నాటకాల పిచ్చి ఉన్న యువకుడిగా నటిస్తున్నాడు. ఇంకా జగపతి బాబు షూటింగ్ కోచ్ గా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. టీజర్ లో జగపతి బాబు, కీర్తి కి మధ్య మనకేది అలవాటు.. గెలుపు, లక్కనేది.. లేదు. మనరాత మనమే రాసుకోవాల అనే సంభాషణలు ఆలోచింపచేసేలా ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ కానుంది. చిరంతన్ దాస్ ఛాయా గ్రహణం అందిస్తున్నారు. దిల్ రాజ్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర నిర్మించారు. ఇప్పటికే చాలా భాగం కంప్లీట్ చేసుకున్న ‘గుడ్ లక్ సఖి’.. మూవీ షూటింగ్ కు కరోనా ఔట్ బ్రేక్ .. బ్రేక్ వేసింది. పరిస్థితులు అనుకూలించిన వెంటనే మిగిలిన పార్ట్ చిత్రీకరణ జరపుకోనుంది. మరి కీర్తి సురేశ్ కు గుడ్ లక్ సఖి చిత్రం నిజంగనే గుడ్ లక్ ను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.