Pattadar Passbooksసీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం నర్శింగోలు గ్రామానికి రానున్న సీఎం, అక్కడ నిర్వహించే మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే ప్రజావేదికలో రైతులతో ముఖాముఖి మాట్లాడటంతో పాటు గ్రామసభలో పాల్గొని స్థానిక వివరాలను అడిగి తెలుసుకోనున్నారు.
పర్యటనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పథకం కింద ఎంపిక చేసిన ఒక బంగారు కుటుంబాన్ని సీఎం చంద్రబాబు సందర్శించే అవకాశం ఉంది. దీనికి తోడు, కొండపి నియోజకవర్గంలో రీసర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన గ్రామాలకు చెందిన 8 వేలకు పైగా రైతులకు ప్రజావేదిక వేదికగా పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
ఈ పర్యటనలో ప్రకాశం జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలకమైన పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. పాలేరు రిజర్వాయర్ స్పిల్వే, ప్రధాన తూముల నిర్మాణ పనులతో పాటు, ముప్పాళ్ల వద్ద పాలేరు నదిపై రూ. 28.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన వంతెన నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.
ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం మధ్యాహ్నం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ, స్థానిక పరిణామాలపై చర్చించనున్నారు. నాడు జగన్ హయాంలో తీసుకువచ్చిన రీసర్వే అడ్డదిడ్డంగా సాగడంతో, దానిని సరిచేయడం కోసం కూటమి సర్కార్ అహర్నిశలు శ్రమిస్తోంది.. చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది..











