ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే రాష్ట్రానికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ లో ప్రధానంగా అమరావతికి ఈ ఏడాది రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే, ఇది ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు రూపంలో ఏపీ ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఈ విషయం తెలియగానే, ఆ అప్పు తీర్చాల్సిందే ఏపీ ప్రభుత్వమే అని, ఇంక అందులో చంద్రబాబు సాధించిందేంటని జగన్ పార్టీ నేతలు నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే.
కానీ, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు ఇవ్వబోయే అప్పునకు కేంద్రం ష్యూరిటీ ఉంటుందని స్పష్టత ఇచ్చారు. తాము మాట్లాడుకొని, అవసరమైతే ఆ అప్పును కేంద్రమే తీర్చుతుందని చెప్పారు. దీంతో అమరావతిని అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నించిన నోర్లు అన్నీ మూతబడ్డాయి.
అయితే, త్వరలోనే ప్రపంచ బ్యాంక్‌తో పాటు మరికొన్ని విదేశీ ఆర్థిక సంస్థలు భారీ మొత్తంలో అమరావతికి రుణం మంజూరు చేయబోతున్నాయి. ప్రపంచ బ్యాంక్ బృందం మరోసారి అమరావతికి రానుంది. ఇప్పటికే వారు రెండుసార్లు అమరావతిలో పర్యటించారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించాలనుకుంటున్న ప్రభుత్వానికి అప్పటికి రూ.15 వేల కోట్లు అందుబాటులోకి వచ్చేస్తాయని అంటున్నారు. అయితే ఇంకా ఈ అప్పులు ఎవరు కట్టాలన్న ప్రశ్న ఏపీలో జగన్ పార్టీ లేవనెత్తుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.
బడ్జెట్లో ప్రకటించిన రూ.15 వేల కోట్ల రుణం ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ (EAP) కింద పరిగణిస్తారు. ఈ ప్రాజెక్టుల కింద ఆర్థిక సాయంలో కేంద్రం అత్యధిక వాటా చెల్లిస్తుంది. రాష్ట్రం అతి తక్కువ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అత్యంత ఎక్కువగా ఈ రేషియా 70:30 శాతంగా ఉంటుంది. అయితే, ఏపీకి సంబంధించి ఈ నిష్పత్తి 90:10గా ఉంటుది. ప్రత్యేక ప్యాకేజీలో 90:10 శాతం ఇలాంటి ప్రాజెక్టుల్లో భరించాలని పెట్టారు. అంటే, రూ.15 వేల కోట్లలో రూ.15 వందల కోట్లు మాత్రం ఏపీ భరించాలి. కానీ ఈ పది శాతం కూడా కేంద్రమే భరించేందుకు ముందుకు వచ్చింది. అంటే, పూర్తి స్థాయిలో ప్రపంచ బ్యాంకు లేదా మరో విదేశీ సంస్థ అమరావతికి రుణానికి చెల్లింపులు చేసేది కేంద్రమే అన్నమాట. రాష్ట్రంపై ఏ భారమూ పడే అవకాశం లేదు. అమరావతి అభివృద్ధిపై పెట్టే పెట్టుబడి అంతా సంపద సృష్టి కాబట్టి, కేంద్రం నిధులు కూడా వృథా అయ్యే అవకాశమే లేదు.