అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు ఇకపై ఊపందుకోనున్నాయి. నిజానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పనులు మొదలుపెట్టడానికి అవసరమైన సన్నాహకాలు జరుగుతూనే ఉన్నాయి. టెక్నికల్ కమిటీ రిపోర్టు రావడం కోసం జాప్యమైన ఈ పనులు డిసెంబరు నెల నుంచి జోరు అందుకోనున్నాయి. ఇక రాబోయే 2025 కొత్త ఏడాదిలో పతాక స్థాయిలో పనులు జరగనున్నాయి. టెక్నికల్ రిపోర్టుతో సంబంధం లేనటువంటి వేరే పనుల కోసం దాదాపు రూ.2 వేల కోట్లతో చేపట్టే కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు సీఆర్డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు కొలిక్కి రావటానికి మరికొంత సమయం పట్టనుంది.
వీటిలో ప్రధానంగా సీఆర్డీఏ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు, బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేందుకు రూ.160 కోట్లు, ఇంటీరియల్ డిజైన్స్, ఆర్కిటెక్ట్ డిజైన్స్ తదితర పనులకు మరో రూ.129 కోట్లతో టెండర్లు పిలిచారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనులకు రూ.930 కోట్లు, అందులో ఇంటీరియర్, ఆర్కిటెక్చర్, హంగుల కోసం మరో రూ.730 కోట్లతో టెండర్లు పిలిచారు. ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్న ఇవన్నీ కొలిక్కి రావటానికి కొంత సమయం పట్టనుంది. టెండర్లు ఖరారై పనులు చేపట్టడానికి నవంబరు, డిసెంబరు నాటికి సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
టెక్నికల్ కమిటీలో హైదరాబాద్, చెన్నై ఐఐటీ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. వారు ఇటీవలే అమరావతిలో ఐదేళ్ల క్రితం ఆగిపోయిన భవనాలు, హైకోర్టు బేస్మెంట్ కాంక్రీట్, ఇతర భవనాల కాంక్రీట్ దృఢత్వాన్ని పరిశీలించారు. పైగా అందులో ఉక్కు కూడా మంచిగా ఉందని రిపోర్టు కూడా ఇచ్చారు. దీంతో ఈ పనుల కొనసాగింపునకు కూడా కన్సల్టెంట్ల కోసం టెండర్లు పిలిచారు. శాశ్వత రాజధాని పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపడతారని అంటున్నారు.
అమరావతికి గ్రాండ్ ఎంట్రన్స్ రోడ్డు అయిన సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశ పనులను ప్రారంభించేందుకు సీఆర్డీఏ ఇప్పటికే రెడీ అయింది. రెండో దశ పనులకు ఆటంకంగా ఉన్న మొత్తం 11 కోర్టు కేసులను పరిష్కరించుకునేందుకు సీఆర్డీఏ తీవ్రంగా కృషి చేస్తోంది. అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి వరదల ముప్పు రాకుండా కొండవీడువాగు, గ్రావిటీ కెనాల్, పాలవాగులను విస్తరించేందుకు డిజైన్స్ కూడా రెడీ చేశారు. వీటితో పాటు 6 చోట్ల రిజర్వాయర్లు ఏర్పాటు చేయటం, మరో మూడు చోట్ల పంపింగ్ స్టేషన్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ పనుల విలువ దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా ఉండవచ్చని అంటున్నారు. మొత్తానికి జగన్ హాయాంలో మరుగున్న పడ్డ పనులన్నింటిని చంద్రబాబు డిసెంబరు నుంచి పరుగులు పెట్టించనున్నారు.