ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు తీసుకెళ్లే దుస్థితికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మారుమూల గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అడవితల్లి బాట కార్యక్రమం పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ ప్రాజెక్టు కింద రెండు దశల్లో మొత్తం రూ.2,078 కోట్ల భారీ వ్యయంతో 2,310 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఇప్పటివరకు 905 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం విజయవంతంగా పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.
డోలీరహిత గిరిజన గ్రామాలే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో రూ.1,005 కోట్ల అంచనాలతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధి పనులు ప్రారంభించారు. పనుల నిర్వహణలో భౌగోళిక పరిస్థితుల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యం దిశగా ముందుకెళ్తున్నారు.
అడ్డంగా ఉన్న పెద్ద పెద్ద గుట్టలను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ విధానంలో సురక్షితంగా పడగొట్టి, రాళ్లు తొలగిస్తూ రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, వర్షాల వల్ల నిర్మాణ సామగ్రిని గిరిశిఖరాలకు చేర్చడం కష్టతరంగా మారుతున్నప్పటికీ అధికారులు వెనక్కి తగ్గడం లేదు. అనేక సవాళ్లను అధిగమిస్తూ, డోలీ కష్టాల నుంచి శాశ్వత విముక్తి కల్పించాలన్న బలమైన సంకల్పంతో అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది..
రహదారుల నిర్మాణంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. అటవీశాఖ అనుమతుల మంజూరు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, ఆయా జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల మధ్య సమన్వయం చేసుకునే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో త్వరలోనే మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి.











