నవ్యాంధ్రప్రదేశ్ కు ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న సాగర నగరం విశాఖపట్టణం పెట్టుబడులకు నెలవుగా మారింది. ఇప్పటికే దాదాపుగా రూ.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు విశాఖకు రాగా…తాజాాగా మరో లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. ఈ తాజా లక్ష కోట్లను ఐటీ దిగ్గజం గూగుల్ విశాఖకు తరలిరానుంది. ఈ నెల 11న ఈ పెట్టుబడికి సంబంధించి ఆ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుంది. విశాఖలో క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్న గూగుల్…అందుకోసమే ఏకంగా రూ.లక్ష కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దీనిపై ఓ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం పూర్తి కాగానే… గూగుల్ తన పనులను 6 నెలల్లోనే ప్రారంభించనుందని ఆయన తెలిపారు.
గడచిన ఐదేళ్లలో వైసీపీ దౌర్జన్య పాలనను చూసి అసలు రాష్ట్రం వైపు చూసేందుకే పారిశ్రామికవేత్తలు భయపడిపోయారు. ఇక అప్పటికే వచ్చిన పారిశ్రామిక సంస్థలు వైసీపీ బెదిరింపులకు జడిసి ఒప్పందాలను రద్దు చేసుకుని పారిపోయాయి. అయితే గడచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విజయం సాధించి చంద్రబాబు అద్యక్షతన నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో తిరిగి పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూడటం మొదలుపెట్టారు. అందులో భాగంగా విశాఖలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకుని… వైసీపీ పాలనతో బెంబేలెత్తిపోయి పారిపోయిన లులూ గ్రూపు చంద్రబాబు సీఎం కాగానే తిరిగి విశాఖకు వచ్చేసింది. ఇక టాటా కన్సల్టెన్సీసర్వీసెస్(టీసీఎస్) తన క్యాంపస్ ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
ఇటీవలే విశాఖ పరిధిలోని నక్కపల్లిలో రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడితో బారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ముందుకు వచ్చాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ఒకే ఒక్క జూమ్ కాల్ తో ఈ పెట్టుబడి విశాఖకు వచ్చేసింది. దీనితో పాటుగా విశాఖ పరిధిలోని అచ్యుతాపురం పరిధిలో ఓ భారీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ను నిర్మించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు విలువ కూడా దాదాపుగా రూ.లక్ష కోట్లకు పైగానే ఉంది. ఈ రెండు కర్మాగారాలతో విశాఖ పరిధిలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
ఇదిలా ఉంటే… ఇటీవలే లోకేశ్ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఏపీలో ఐటీ సేవల స్థాపన, విస్తరణలకు అనువుగా ఉన్న పరిస్థితులను ఆయన ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు. అంతేకాకుండా ఐటీ రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా ఆయన వారి ముందు పెట్టారు. లోకేశ్ పర్యటన ముగిసిన వెంటనే గూగుల్ తన ప్రతినిధి బృందాన్ని ఏపీకి పంపింది. రాజధాని అమరావతికి సమీపంలో విజయవాడ, గుంటూరులకు మధ్యన తన అనుబంధ సంస్థ అయిన యూట్యూబ్ కు సంబంధించి ఓ అకాడెమీనే ఏర్పాటు చేసేందుకు గూగుల్ సిద్ధ పడింది. తాజాాగా విశాఖలో గూగుల్ క్లౌడ్ పేరిట క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థను ఆ సంస్థ ఏర్పాటు చేసేందుకు సమ్మతించింది. అందుకోసం ఏకంగా రూ.లక్ష కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపింది.