స్కూబీ విధి నిర్వహణలో ఉన్నంత కాలం ఎప్పుడూ వెనుదిరగ లేదు… అలసిపోయానని మొరాయించనూ లేదు. నమ్ముకున్న వృత్తికే అంకితమై అద్భుత సేవలందించింది. తన పనితీరుతో డిపార్ట్ మెంట్ కు కీర్తి తెచ్చిపెట్టింది. అందుకే తను రిటైర్ అయినా… మనకెందుకులే అనుకోకుండా, అనారోగ్యంతో కనుమూసిన స్కూబీ సేవలు స్మరించుకుంటూ ప్రకాశం జిల్లా పోలీసులు ప్రభుత్వ మర్యాదలతో అంతిమయాత్ర నిర్వహించారు.
ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తోపాటు పోలీసులు ప్రేమతో శనివారం ఆ శునకరాజానికి అంత్యక్రియలు నిర్వహించి… శభాష్ పోలీస్ అనిపించుకున్నారు.
స్కూబీకి ఘననివాళులు…
డిస్పోజబుల్ బాంబ్ స్క్వాడ్ లో ఈ స్నిపర్ డాగ్ బాంబులు గుర్తించి ప్రజల ప్రాణాలు రక్షించించింది. అందుకే స్కూబీ కూడా తమతో సమానమని చెప్పకనే చెప్పారు. తొలుత ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ స్మారక స్థూపం వద్ద స్కూబీ కి ఎస్పీ ఘన నివాళులర్పించాక… జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ర్యాలీగా స్కూబీ మృత దేహంతో కర్నూల్ రోడ్డు, మంగమూరు జంక్షన్ మీదగా, జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ చేరి, అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.
చూశారా…మరణమనేది ఖాయమని…మిగులును కీర్తి కాయమని… ఈ మాట మనుషులకే కాదు… విశ్వాసంతో డ్యూటీ చేసిన ఆ శునకానికి కూడా.











