ఏపీలో జిల్లాల కోసం ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. పార్లమెంటు స్థానాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం చాలా జిల్లాలలో ఉద్యమాలకు ఊతం ఇస్తోంది. గుంటూరు జిల్లాలో పల్నాడు కేంద్రంగా ఎప్పటి నుంచో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఏపీలో జిల్లా విభజన కూడా ప్రారంభం కావడంతో ఇక గురజాల కేంద్రంగా జిల్లాల ఏర్పాటుకు గురజాల జిల్లా సాధన సమితి పేరుతో జేఏసీ ఏర్పాటైంది. ఇక ప్రకాశంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా చేయాలని ఆ ప్రాంత ప్రజలు రెండు దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. అక్కడ కూడా జిల్లా ఏర్పాటు కోరుతూ నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
ఇక శ్రీకాకుళం జిల్లాను చీల్చడం ఈ జిల్లా ప్రజలకు ఇష్టం లేదు. ఇక తిరుపతిలో స్వామి వారిని అమ్మవారిని వేరు చేసే విధంగా జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జనం వ్యతిరేకిస్తున్నారు. తిరుచానూరు చిత్తూరు జిల్లాలోకి వెళ్లడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇలా ప్రతి జిల్లాలో ఏదో ఒక లొల్లి నడుస్తూనే ఉంది. అయితే జిల్లాల ఏర్పాటు ఉద్యమాలను అణచివేయాలని పోలీసు అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇలా జిల్లాగోల రాజుకుంటూ వెళితే రాజకీయంగా తీవ్రనష్టం వాటిల్లుతుందని, లక్షా రూ.20 వేల కోట్లు ఖర్చు చేసి చేపట్టిన సంక్షేమ పథకాల ప్రయోజనం నెరవేదని వైసీపీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ప్రకాశం పంతులుగారిని బాపట్ల జిల్లాలో కలుపుతారా?
ప్రకాశం జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు చాలా సమస్యలకు దారితీసేలా ఉంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంటు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే మార్కాపురం, గిద్దలూరు,ఎర్రగొండపాలెం, రాచర్ల, డోర్నాల ప్రజలకు పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. ఇప్పటికీ వారు జిల్లా కేంద్రానికి రావాలంటే 90 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. అందుకే ప్రకాశం పశ్చిమ ప్రాంత ప్రజలు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండుతో నిరసనలు ప్రారంభించారు. అయితే ప్రకాశం పశ్చిమ ప్రాంత వైసీపీ నేతలు ఈ విషయాలన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఒంగోలు కేంద్రంగానే జిల్లాను కొనసాగించాలని మంత్రి బాలినేని భావిస్తున్నారట. ఇక వేళ ఒంగోలు జిల్లాకు అధనంగా మరో జిల్లా ఏర్పాటు చేస్తే అప్పుడు, మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుంది. అలా కాకుండా ఒంగోలు జిల్లా కేంద్రాన్ని మార్కాపురం మారిస్తే మాత్రం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రకాశం జిల్లాలో గిరిజనులు ఎక్కువగా నివశించే పశ్చిమప్రాంతంలో అంటే మార్కాపురంలో జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.
ఒంగోలు జిల్లాను కొనసాగిస్తూ ప్రకాశంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇందుకు సీఎం సముఖంగా లేరని తెలుస్తోంది. అందుకే జిల్లాల ఉద్యమాలను అణచివేయాలని పోలీసు అధికారులను ఆదేశిచారనే సమాచారం వస్తోంది. ఇక ప్రకాశం పంతులుగారి పేరుతో ఏర్పడిన ప్రకాశం జిల్లాకు ఒంగోలు కేంద్రంగా ఉంది. అయితే ప్రకాశం పంతులుగారు జన్మించిన సంతనూతలపాడు నియోజకవర్గం మాత్రం బాపట్ల ఎంపీ స్థానంలో ఉంది. అయితే పంతులుగారిని ప్రకాశం జిల్లాలో ఉంచుతారా? లేదంటే బాపట్ల జిల్లాలో కలుపుతారా అనేది తేలాల్సి ఉంది.
Must Read ;- ప్రభుత్వానికి పక్కలో బల్లెం… నిమ్మగడ్డ
గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా సాధ్యమా?
గురజాల నియోజకవర్గం కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని పల్నాడులోని గురజాల, మాచర్ల వైసీపీ నేతలు కోరుతున్నారు. గురజాల జిల్లా డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్న వారికి స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. గురజాల జిల్లా ఏర్పాటు విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు. గురజాలను జిల్లా కేంద్రం చేయకుండా నరసరాపుపేటను జిల్లా చేస్తే ఇక గురజాల, మాచర్లలో వైసీపీ దుకాణం బంద్ అవ్వడం ఖాయం. అందుకే పల్నాడు వైసీపీ నేతలు ఇప్పుడు గురజాల జిల్లా పాటందుకున్నారని తెలుస్తోంది. ఇక టీడీపీ నేతలు కూడా పల్నాడు జిల్లాకే మొగ్గు చూపుతున్నారు.
ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తారు?
పార్లమెంటు స్థానాలే ప్రామాణికంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అదనంగా అరకులో గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంటే మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ఆయా జిల్లాల నుంచి వస్తున్న డిమాండ్లను అధ్యయనం చేసిన కొందరు అధికారులు 32 జిల్లాలు ఏర్పాటు చేస్తే మంచిదని సీఎంకు సూచించారట. అయితే దానిపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
పొరపాటు జరిగితే రాజకీయ సమాధి తప్పదు
జిల్లాల ఏర్పాటులో ప్రజల మనోభావాలను పట్టించుకోకుంటే అధికార పార్టీకి రాజకీయ సమాధి తప్పదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజల మనోభావాలను గౌరవించి జిల్లా కేంద్రాలను, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 2026లో పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ అధ్యయనం చేసి, ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేతలు సూచిస్తున్నారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం గుంభనంగా వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు ఎవరు వదులుకుంటారు చెప్పండి. వైసీపీ అధినేత కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వడం లేదట. అంటే ప్రతిపక్షాలను ఇరుకునపెట్టే స్కెచ్ ఏదో నడుస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
అయితే ఇప్పట్లో జిల్లా ప్రక్రియ కొలిక్కివచ్చే అవకాశాలు కూడా లేవు. మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణాలు చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి కావాలంటే కనీసం సంవత్సరం పట్టే అవకాశం ఉంది. అప్పటి దాకా జిల్లాల ఏర్పాటు చర్చలకు మాత్రమే పరిమితం అవుతాయని తెలుస్తోంది.
Also Read ;- అల్లుడు జగన్ మీద అప్పుడే విరక్తి పుట్టిందా?