(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా రామతీర్థం గుడిలో రాముడి తల ఖండించిన సంఘటనలో దోషులను పట్టుకుని శిక్షించాల్సిన వైసీపీ ప్రభుత్వం సమస్యను రాజకీయం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. రామతీర్థం సంఘటనను ఆసరా చేసుకుని బీజేపీ జిల్లాలోను, రాష్ట్రంలోను మత ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిపక్ష టీడీపీ.. అధికార వైసీపీలు సమస్యను రాజకీయాలకు వాడుకోవాలనే ప్రయత్నించడం రాష్ట్రంలో మతోన్మాద శక్తులకు అవకాశం ఇవ్వడమేనని అన్నారు. ప్రజా సమస్యలు ప్రక్కన బెట్టి విగ్రహ సమస్యే ప్రధానంగా భావించడం దురదృష్టమని, వెంటనే దోషులను శిక్షించి, సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక కోట నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి టీ. సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, టి. వి రమణ. జిల్లా కమిటీ సభ్యలు పి. రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో సెక్షన్ 30 అమలు : ఎస్పీ రాజకుమారి
విజయనగరం జిల్లాలో శాంతిభద్రతలు, కోవిడ్ 19 వ్యాప్తి దృష్ట్యా సభలకు అనుమతులు లేవని, ప్రస్తుతం సెక్షను 30 పోలీసు చట్టం 1861, కోవిడ్ డిసాస్టర్ మేనేజ్ మెంటు చట్టం అమలులో ఉన్నందున ప్రజలెవ్వరూ చట్టాలను అతిక్రమించ వద్దని, బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాల నిర్వహణలో పాల్గొనవద్దని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రామతీర్ధంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ పరిసరాల్లో సభలు, సమావేశాల నిర్వహణకు ఎటువంటి అనుమతులూ లేవని ఎస్పీ తెలిపారు. చట్టాలను అతిక్రమించి ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.