గ్రేటర్ హైదరాబాద్ లో కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారానికి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. నవంబర్ 17న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం డిసెంబర్ ఒకటిన ఎన్నికలు నిర్వహించింది. 4వ తేదీన ఫలితాలను వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారానికి గెజిట్ విడుదల చేయలేదు ఎన్నికల సంఘం. ప్రస్తుత పాలక మండలి గడువు ఫిబ్రవరి 10న ముగియనున్న నేపథ్యంలో అప్పుడే కొత్త పాలక మండలి ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందంటూ గతంలో తెలిపింది ఎన్నికల సంఘం. అయితే ఒక నెల ముందే కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లను గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎన్నికల సంఘం తీరుపై బీజేపీ ఆందోళన..
ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటికీ గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయడం లేదంటూ ఆందోళన చేపట్టారు కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టి .. వినతి పత్రం అందజేసారు. అయినా అటు ఎన్నికల కమిషన్ కాని ఇటు ప్రభుత్వం కాని స్పందించలేదని ఆగ్రహం వ్యక్త చేసారు బీజేపీ నేతలు. ప్రభుత్వ తీరుకు నిరసణనగా బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ పార్టీ కి తొత్తుగా మారిందని .. కమిషనర్ టీఆర్ఎస్ పార్టీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కొత్త పాలక మండలి ఏర్పాటులో ప్రభుత్వం , ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడించారు కొత్త గా ఎన్నికైన కార్పొరేటర్లు. వెంటనే పాలకమండలి ఏర్పాటు చేయక పోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు.
గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో కొత్త పాలక మండలికి రూట్ క్లియర్..
ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ తో కొత్త పాలక మండలి ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను అదికారికంగా గుర్తింపు వచ్చినట్టైంది. నిబంధనల మేరకు పాత పాలక మండలి పూర్తి కాలం ముగియకుండా రద్దు చేయలేమని తెలిపింది ఎన్నికల కమిషన్. పదవీ కాలం వచ్చే నెల 10న ముగియనున్న నేపథ్యంలో నెలరోజుల ముందు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కూడా మరో నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం వచ్చే నెల 10వ తేదీనే చేయించాలని లేదంటే మరోమారు ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు బీజేపీ నేతలు.