కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. స్వపక్షంలోనే విపక్షం తయారైందా అన్నట్లుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి.అక్కడ ముఖ్యంగా కరీంనగర్ ప్రస్తుత మేయర్ సునీల్ రావుకు మాజీ మేయర్ రవీందర్‌సింగ్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో విభేధాలు రాజుకుంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
వీరిద్దరికి ఏ విషయంలోనూ అస్సలు పొసగడం లేదని తెలుస్తోంది. ఒకరినొకరు అధికార ప్రతిపక్ష పార్టీలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉందట. ఇప్పటికే పలుమార్లు వివిధ వేదికలపైనా వీరి వైరం బయటపడింది. వీళ్ల వైరం చూసిన వారు..అధికారంలో ఉన్న వారే ఇలా వ్యవహరిస్తే ప్రతిపక్షానికి మనం ఛాన్స్ ఇచ్చినవారమౌతామని కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీ గురించి ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు పోయే అవకాశం కూడా లేకపోలేదని, ప్రతిపక్షాలకు మనమే అవకాశమిచ్చినట్లుగా అవుతామని వీరి వైరం గురించి చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.
సునీల్ రావు వర్సెస్ రవీందర్ సింగ్!
అరుదైన రాజకీయ ఘటనకు కరీంనగర్ వేదికైంది. సునీల్ రావు (మేయర్) వర్సెస్ రవీందర్ సింగ్(మాజీ మేయర్) అన్నట్లు రాజకీయ చర్చ నడుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో రవీందర్ సింగ్ కీలకంగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రవీందర్‌సింగ్‌కు మేయర్‌గా పనిచేసే అవకాశం చిక్కింది. అక్కడ ఆయనది బలమైన సామాజిక వర్గంగానే కరీంనగర్లో చెప్పుకుంటుంటారు. పార్టీ పెద్దల ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉండటంతో ఆయనకు ఎదురే లేకుండా పోయింది. తాను మేయర్గా పనిచేసిన కాలంలో పార్టీ పెద్దల నుంచి మంచి మార్కులే కొట్టేశారు.
మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మరోసారి మేయర్ పీఠాన్ని రవీందర్‌సింగ్ ఆశించి ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీచేశారు. కొన్ని రాజకీయ కారణాలు, సమీకరణాల కారణంగా కార్పొరేటర్‌గా గెలిచినా మేయర్ గా ఆయన పేరును పరిశీలనలోకి తీసుకోలేదు. ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌తో ఆయనకు పడకపోవడంతోనే రాజకీయ సమీకరణాలు మారిపోయాయనేది చర్చ. ఈ నేపథ్యంలో మేయర్‌గా సునీల్‌రావును ఎంపిక చేశారు. పైగా గంగులతో సునీల్‌రావుకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌కి కూడా ఆయన సన్నిహిత వర్గంలో సునీల్ రావు ఒకరని ప్రచారం. దీంతో రవీందర్‌సింగ్ ఆశ నెరవేరలేదని చెప్పుకుంటారు.
తొలి సమావేశంలోనే విభేదాలు…
ఈ సమీకరణాలే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్‌ఎస్ రాజకీయాలను వేడెక్కించాయి. కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయే స్థాయికి చేరుకుంది. మేయర్‌కు మాజీ మేయర్‌కు మధ్య ఈ విభేదాలు కార్పొరేషన్ తొలి సాధారణ సమావేశంలోనే బయటపడ్డాయి. అవి అలానే కంటిన్యూ అవుతునే ఉన్నాయి. నగర సమస్యలను పక్కన పెట్టి అధికారపక్షం ఇలా విమర్శించుకోవడంపై పార్టీ కార్యకర్తలు, జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రొటోకాల్ అంశాలపైనా వైరి వర్గాల మాదిరి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మేయర్‌గా నువ్వేమ్ వెలగబెట్టావ్ అంటే…నువ్వేమ్ వెలగబెట్టావ్ అని విమర్శలు చేసుకుంటున్నారట. అధికారపక్షంపై తమకి విమర్షించే అవకాశమే ఇవ్వకుండా తమ స్థానాన్ని వీరిద్దరే భర్తీ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
అంతా తెలిసే మంత్రి సైలెంట్ గా ఉంటున్నారా?
కరీంనగర్ మేయర్, మాజీ మేయర్ మధ్య విభేధాలు అంతా మంత్రి గంగులకు తెలిసే జరుగుతోందని చర్చ జరుగుతోంది. పైగా మంత్రి ఆశీసులు లేకుండా మేయర్ సునీల్‌రావు ఆ విధంగా మాట్లాడకుండా ఉండరని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాకపోతే గతంలో జరిగిన తొలి సమావేశంలో బయటపడ్డ విభేదాలు రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయోనని చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఇద్దరు నాయకులు ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరి.. పార్టీ పెద్దలు వీరి మధ్య సయోధ్య కుదురుస్తారో లేదో చూడాలి. అభివృద్ధి చేయడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజం. కానీ అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమేంటని అంతా అనుకుంటున్నారు.