Growing Demand For Samuthirakani :
సముద్రఖని .. ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులు బాగా వింటున్న పేరు. మనిషి చూడటానికి చాలా సింపుల్ గా ఉంటాడు. తెరపై ఎలాంటి హడావిడి చేయడు .. భారీ డైలాగులు అసలే చెప్పడు. ఒక వాక్యంలో సమాధానాలు రాయండి అన్నట్టుగా చాలా తక్కువగా మాట్లాడతాడు .. సాధ్యమైనంతవరకూ చూపులతోనే పనికానిచ్చేస్తాడు. ఆయనలోని ఈ కొత్తదనం .. ప్రత్యేకత ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అందువల్లనే తమిళంలో ఇప్పుడు ఆయన బిజీ విలన్ … తెలుగులో బిజీ అవుతున్న విలన్.
తెలుగులో వచ్చిన ‘రఘువరన్ బీటెక్’ సినిమా ద్వారా సముద్రఖని(Samuthirakani) ఇక్కడి ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ధనుశ్ తండ్రి పాత్రలో ఆయన చూపిన నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఒక మధ్య తరగతి తండ్రి ఎలా ఆలోచిస్తాడు? ఎలా ప్రవర్తిస్తాడు? అనేది ఆయన అద్భుతంగా ఆవిష్కరించాడు. అలాంటి సముద్రఖని ‘అల వైకుంఠపురములో‘ సినిమాలో ‘అప్పలనాయుడు’ పాత్రను గొప్పగా పోషించాడు. గొడుగు పట్టుకుని తిరుగుతూ .. గొడవ లేకుండానే అవతలివారిని పైకి పంపించే ఆయన విలనిజం అదుర్స్ అనిపించుకుంది.
ఈ సినిమాలో వచ్చిన పేరే ఆయనకు ‘క్రాక్’ సినిమాలో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ‘క్రాక్’ సినిమాలో ఆయన పోషించిన ‘కటారి కృష్ణ( Katari Krishna)’ పాత్ర జనంలోకి విపరీతంగా వెళ్లింది. కటారి కృష్ణ గానే తనని అభిమానులు గుర్తించేలా ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ‘ఆర్ ఆర్ ఆర్‘ .. ‘ఇండియన్ 2‘ వంటి భారీ ప్రాజెక్టులలోను ఆయన ఉన్నాడు. కీరవాణి తనయుడు ‘సింహా’ కొత్త సినిమా కోసం కూడా సముద్రఖనిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొన్ని తెలుగు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట. మంచి రచయిత … దర్శకుడు అయిన సముద్రఖని, తెలుగులో ప్రతినాయక పాత్రలతో బిజీ అవుతుండటం విశేషమే.
Must Read ;- చైతన్య లవ్ స్టోరీకి పది భారీ ఆఫర్స్ వచ్చాయా.?











