తెలుగు తెరపై రౌద్ర రసానికి పూర్తి హక్కుదారుడు .. పౌరుషం కలిగిన పాత్రలకు పట్టాదారుడు కృష్ణంరాజు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో విభిన్నమైన .. విలక్షమైన పాత్రలకు కృష్ణంరాజు ప్రాణం పోశారు. రౌడీయిజంతో కూడిన హీరోయిజానికి క్లాప్ కొట్టేసి, అప్పటివరకూ తెలుగు తెరపై అంతగా కనిపించని కొత్త పద్ధతికి ఆయన శ్రీకారం చుట్టారు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో .. కొత్తగా అనిపించే ఒకరకమైన నవ్వుతో ఆయన ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
కట్టలుతెంచుకునే ఆవేశంతో కూడిన పాత్రలకి ‘కటకటాల రుద్రయ్య’తో అంకురార్పణ చేసిన కృష్ణంరాజు, చారిత్రక చిత్రాలపై కూడా చెరగని సంతకం చేశారు. ‘తాండ్రపాపారాయుడు’ .. ‘విశ్వనాథ నాయకుడు’ .. ‘రుద్రమదేవి‘ సినిమాలు అందుకు ఊరంత ఉదాహరణలుగా కనిపిస్తాయి. కృష్ణంరాజు చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తయితే, ఈ మూడు పాత్రలు మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఆయన మాత్రమే చేయగలిగిన పాత్రలు .. ఆయనను మాత్రమే చూడగలిగిన పాత్రలు. ఆ మధ్య వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమా చూసినవారు, ఆయన పోషించిన ‘గణపతిదేవ చక్రవర్తి’ పాత్రను అంతతేలికగా మరిచిపోలేరు.
గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ‘గణపతిదేవ చక్రవర్తి’ పాత్రలో కృష్ణంరాజు విశ్వరూప విన్యాసం చేశారు.ఆ పాత్రను ఆయన చేయడం వల్లనే ఆ సినిమాకి ఒక నిండుదనం వచ్చిందని పలు వేదికలపై గుణశేఖర్ చెప్పారు. ఆ సినిమా నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ కారణంగానే ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న కృష్ణంరాజుకు ఆయన సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంలోను ఆయన ‘గణపతిదేవ చక్రవర్తి’ పాత్రను గుర్తుచేసుకుంటూ అందుకు సంబంధించిన స్టిల్ ను పోస్ట్ చేశారు.
Must Read ;- తెలుగు తెర రెబల్ స్టార్ .. కృష్ణంరాజు (జన్మదిన ప్రత్యేకం)