కాపీ రైట్… ఇది రైటో రాంగో తెలియదుగానీ ఈ పదం వింటేనే తెలుగు సినీ పరిశ్రమలో కొందరు ఉలిక్కిపడుతున్నారు. మొన్నటికి మొన్ననిర్మాత విష్ణు ఇందూరి – దర్శకుడు దేవా కట్టాల మధ్య ఇలాంటి వివాదమే నడిచింది. తాజాగా ఇప్పుడు అగ్రదర్శకుడు కొరటాల శివ వంతు వచ్చింది. ఇవన్నీ వింటుంటే, చూస్తుంటే సినిమా కథకు భద్రత లేదా అనే భయం కూడా కలుగుతోంది. అసలు ఈ వివాదాలు ఎందుకొస్తున్నాయి? మరి అసోసియేషన్లు ఏంచేస్తున్నాయి? ఆ కథ ఎవరిదో ఎందుకు తేల్చలేకపోతున్నాయి?… ఇవన్నీ సమాధానం ఉన్నా సమాధానం ఇవ్వలేని ప్రశ్నలే.
కథ వినడమే కాపీ రైట్ !
అరవై నాలుగు కళల్లో సినిమా కళ లేదు కానీ చోర కళ ఉంది. అందుకే చాలామంది తెలుగు సినీ రచయితలు, దర్శకులు చోర కళే సినిమా కళగా భావిస్తుంటారు. విదేశీ సినిమాలు, పాత సినిమాలు లేదా తెలుగు కథలు, నవలల నుంచి మక్కికి మక్కీ కాపీ కొట్టేవాళ్ళని గురూజీ అని ముద్దుగా పిలుచుకుంటుంది తెలుగు సినీ పరిశ్రమ. కాపీ కొట్టినా సోషల్ మీడియాలో హడావుడే తప్ప ఏ యూనియన్ తమకి వ్యతిరేకంగా ఏమీ చేయలేదని కాపీ రాయుళ్ల ధీమా.
కొన్నేళ్ల క్రితం ఓ భారీ సినిమా వచ్చింది. తనకి రచయితగా సరైన క్రెడిట్స్ ఇవ్వలేదని బాధతో, కోపంతో దర్శకుడిగా మారిన ఆ దర్శక రచయిత తనకి అన్యాయం చేశాడని ఓ రచయిత్రి ఫిర్యాదు చేసింది.
ఆ కథ ఓ నవలగా ప్రముఖ మీడియా సంస్థలో ప్రచురితమైంది. రచయిత్రి తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేసినా లాభం లేకపోయింది. చివరికి కోర్టుకి వెళ్ళింది రచయిత్రి. అయితే కోర్టులో ఆ దర్శక రచయిత ఇలాంటి ఆరోపణల వల్ల తమ సినిమా కల్లెక్షన్స్ తగ్గిపోయాయని, అందుకు గాను సదరు రచయిత్రి రూ. 50 లక్షల జరిమానా కోరాడని వార్తలు వచ్చాయి. ఆ రచయిత్రి తనకి ఉన్న రెండెకరాల పొలం అమ్మి జరిమానా కట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. న్యాయం చేయమని, రైటర్ కావడం పొరపాటైందని ఆ రచయిత్రి ఇండస్ట్రీ పెద్దలను కలిసి ప్రాధేయ పడింది. అయినా లాభం లేకపోయింది.
రెండేళ్ల క్రితం ఒక సీనియర్ రైటర్ ఓ కథ రాసి .. ఈ మధ్య వార్తల్లో నిలిచిన ఒక హీరోకి చెప్పాడు. ఆ హీరో, ఆ రచయితకి కూడా చెప్పకుండా.. అప్పటికి ఫ్లాప్స్ లో ఉన్న ఒక డైరెక్టర్ కి చెప్పాడు. ఆ రచయితకి క్రెడిట్స్, డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని ఆ డైరెక్టర్ కథని కాపీ కొట్టాడు. తిరగేసి, మరగేసి సినిమా తీశారు . పెద్ద హిట్ కొట్టారు. కంప్లైంట్ చేసినా దొరకనంత జాగ్రత్తగా కాపీ కొట్టారు.… రాజమౌళి ‘దర్శక ధీరుడు’గా పేరు తెచ్చుకుంటే, ఈ డైరెక్టర్ మాత్రం దర్శక చోరుడు అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు.
తప్పు చేసినా తప్పించుకునే అవకాశం సినిమా రంగంలో కొందరు రచయితలకి, దర్శకులకి ఉంటుంది. యూనియన్స్ న్యాయం చేయనప్పుడు ప్రేక్షకులే అలాంటి కాపీ రాయుళ్ల సినిమాలు తిప్పిగొట్టాలి. అలా అయినా మోసపోయిన వారికి కొంత న్యాయం జరుగుతుంది. సినిమా రంగంలో ఇలాంటి గురూజీల ఆటలు ఇంకెంతకాలం సాగుతాయో చూడాలి.