విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న ఆ నమ్మకాన్ని, నాణ్యతను గత జగన్ ప్రభుత్వం ప్రైవేట్ శక్తులకు పణంగా పెట్టింది. ఒక ప్రభుత్వ బ్రాండ్‌ను సొంత లాభం కోసం తాకట్టు పెట్టడం చరిత్రలోనే ఎరుగని వింత. ఈ భారీ లీజు కుంభకోణాన్ని తెలంగాణ విజయా డెయిరీ చైర్మన్, కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు.
సాధారణంగా ప్రభుత్వాలు నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాయి. కానీ, ఏపీలో అందుకు భిన్నంగా.. అత్యంత ప్రజాదరణ పొందిన విజయా బ్రాండ్ నేమ్‌ను మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేటు సంస్థకు లీజు పేరుతో జగన్ ప్రభుత్వం ధారాదత్తం చేసింది. అసలు బ్రాండ్ విలువను పెంచాల్సింది పోయి, ప్రైవేటు వ్యక్తులు ఆ పేరును వాడుకుని కోట్లు గడించేలా వెసులుబాటు కల్పించారు ఆనాటి పెద్దలు.
ఈ సంస్థ వెనుక అప్పటి అధికార పార్టీకి చెందిన బడా నేతల హస్తం ఉందన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ ముసుగులో జరిగిన ప్రైవేటు దోపిడీకి ఇదో క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ లీజు వెనుక ఉన్న అసలు ప్రమాదం కల్తీ. విజయా పేరు ఉంటే చాలు ప్రజలు కళ్లు మూసుకుని కొంటారనే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని.. ఎలాంటి నాణ్యతా పరీక్షలు లేకుండానే మార్కెట్లోకి సరుకును వదిలారు. తాగే పాల నుంచి, ప్రతి ఇంట్లో వాడే నెయ్యి వరకు కల్తీ కోరల్లో చిక్కుకున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం విజయా డెయిరీని పునర్వైభవం వైపు నడిపిస్తూ కోట్లాది రూపాయల పెట్టుబడులు పెడుతోంది. అయితే, ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల విజయా అనే బ్రాండ్ ప్రతిష్టకే మచ్చ వస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు విజయాను ఒక్కటే అనుకుంటారు. ఏపీలో జరిగిన ఈ అక్రమ లీజు వల్ల, అక్కడి నాసిరకం ఉత్పత్తుల ప్రభావం తెలంగాణ డెయిరీపై, ఇక్కడి పాడి రైతులపై కూడా పడుతోందని గుత్తా అమిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని అమ్మేసి, ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ఈ లీజు కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అప్పుడే విజయా బ్రాండ్‌కు మళ్లీ పూర్వ వైభవం, ప్రజల్లో నమ్మకం తిరిగి వస్తాయి.











