హఫీజ్‌పేట భూముల వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాంతంలోని భూములు నిజాం హయాంలో పంపిణీ చేసినవని, రైల్వే లైన్ల కోసం సేకరించిన భూములకు బదులు ఇక్కడ భూములు ఇచ్చారని చెబుతుంటారు. నిజాం పాలన తరువాత వచ్చిన చట్టాలు, మార్పులు, భూ సంస్కరణల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని భూములు వక్ఫ్ బోర్డుకి లేదా ప్రభుత్వానికి (చాలా వరకు) వెళ్లాయని చెబుతుంటారు. కొన్ని సర్వే నెంబర్లలో న్యాయవివాదం తలెత్తినా..మిగతా భూముల విషయంలో వివాదాల్లేవు. కచ్చితం ప్రభుత్వ భూమిగానే రికార్డుల్లో ఉండేది. అయితే ఇప్పుడు అది మాయమైంది. వేల ఎకరాలు పోయి..వందల ఎకరాలకు పరిమితమైంది. రికార్డుల తారుమారు, మ్యూటేషన్లు..ఆక్రమణలు ..ఇలా చాలా జరిగాయి. గతంలో ఈ భూమికి సంబంధించి చాలా వ్యవహారాలు నడిచాయి. 2003లో ఈ భూముల్లో ప్రైవేటు భూములూ ఉన్నాయని ఓ కేసులో సుప్రీంకోర్టు తేల్చడం, తరువాతి కాలంలో ఆక్రమణలు పెరగడం, రాజకీయ నాయకుల జోక్యం పెరగడానికి కారణమైంది. ఇటీవల జరిగిన ఘటనలో సర్వే నెంబరు 80లో ఉన్న దాదాపు 50 ఎకరాల విషయంలో ప్రవీణ్‌రావుకి, భూమా కుటుంబానికి మధ్య వివాదం నడుస్తోంది. ఈ సర్వే నెంబరులో ఉన్న మొత్తం భూమి 484.31 ఎకరాలు. ఇది రికార్డుల్లో కనిపిస్తోంది. దీంతో పాటు మరో 140 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. వీటికి తామే హక్కుదారులమంటూ పాయ్‌గా, చావూస్ వారసులు పోరాటం చేస్తున్నారు. మరోవైపు ఈ భూములు ఓ వైపు ఆక్రమణకు గురవుతూ వస్తున్నాయి.
Must Read ;- నాగిరెడ్డి మరణం తరువాత.. వివాదాల్లో అఖిల ప్రియ
సుప్రీం కోర్టు ఆపినా..
భూమి ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకు కలిపి సర్వే నెంబరు 80లోనే.. 624.31 ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భూమా కుటుంబానికి, ప్రవీణ్‌రావుల వివాదానికి కేంద్రంగా మారిన ఇదే సర్వె నెంబరులోని భూమి విషయంలో కొన్నాళ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా కనిపిస్తోందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ భూముల విషయంలో ప్రభుత్వం దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తోంది. ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో గతంలో 50 ఎకరాల విషయంలో హైకోర్టు ప్రవీణ్‌రావుకి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. ఆరురోజుల్లోనే విచారణ జరిపి తీర్పునివ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ కేసులో హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ డిసెంబరు 15న ఉత్తర్వులు ఇచ్చింది. ఫ్రభుత్వం వక్ఫ్ బోర్డుకు తగిన సమయం ఇచ్చి, వాదనలు విన్న తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయినా ఈ సర్వే నంబర్‌లో భూముల క్రయ విక్రయాలు ఆగలేదు. ప్రభుత్వం ఆక్రమణ దారులను నిలువరించలేదు. మరోవైపు ఏవీ సుబ్బారెడితో ప్రవీణ్‌రావు సెటిల్‌మెంట్ చేసుకోవడం, ప్రవీణ్‌రావు ఆ భూముల్లో కార్యకలాపాలు మొదలుపెట్టడం ఈ కిడ్నాప్‌కు కారణమైందనే చర్చ నడుస్తోంది. ఈ భూముల విషయాలను పరిశీలిస్తే.. తొలుత వివాద రహితంగా ఉన్నా, ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదాస్పదంగా ఉన్న భూములను రిజిస్టర్ చేయించుకుని తరువాతి కాలంలో ప్రభుత్వ, వక్ఫ్ భూములపై కన్నేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
వక్ఫ్‌కి, ఓవైసీలకు తెలియదా..
హఫీజ్‌పేట, హైదర్‌నగర్ ప్రాంతాల్లో వేల ఎకరాల ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు ఉన్నాయి. ఏటా ఆక్రమణలు పెరిగిపోతున్నా ఈ విషయంలో ప్రభుత్వానికి గాని, వక్ఫ్ బోర్డుకి కాని, లేదా తమ వర్గం కోసం పోరాడేందుకే జీవితం అని చెప్పే ఓవైసీ సోదరులకు గాని తెలియదా అనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో వక్ఫ్ భూముల విషయంలో పలుమార్లు ప్రభుత్వాలను నిలదీసిన ఓవైసీ బ్రదర్స్ ఈ భూముల విషయంలో కొన్నేళ్లుగా పెద్దగా స్పందించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
Must Read ;- తెలంగాణలో పెరిగిన భూ ఆక్రమణలు.. విచారణకు బీజేపీ డిమాండ్