పెద్దగా చదువుకోని అంజయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేశారు.
రైల్వేస్టేషన్లో చాయ్ అమ్మిన నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాన మంత్రి అయ్యారు.
ఈ రెండు విభిన్న సంఘటనలు బహుశా భారతదేశ ప్రజాస్వామ్యానికే సాధ్యమయ్యే అపురూప, అరుదైన సంఘటనలు. ప్రజాసేవకు, పాలనకు పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేదని, ప్రజలకు నిస్వార్ధ సేవ చేసే మనసుండాలని నిరూపించిన ఘటనలు ఇవి. ఈ ఇద్దరు నాయకుల్లో అంజయ్య తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎదిగి… తెలంగాణ బిడ్డా… నిను మరువదు ఈ గడ్డ అని పేరు తెచ్చుకున్నారు.
నేటి భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తనదైన పాలనలో శైలీని చూపిస్తూ భారత ప్రజలను అభిమానపాత్రుడవుతున్నారు. ఏడు పదుల వయసులో నాలుగు పదుల యవ్వనంతో పని చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్ లోని మెహ్సానా జిల్లాలోని వాద్ నగర్ లో పుట్టారు. ఆ కుటుంబం గట్టుగా బతికేదే తప్ప రాజకీయాల నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. నరేంద్ర మోదీ తన 20 వ ఏట విశ్వహిందూ పరిషత్ లో చేరారు. ఆ తర్వాత కొంత కాలానికి భారతీయ జనతా పార్టీ విద్యార్ధి విభాగం అఖిల భారత విద్యార్ధి పరిషత్ లో పని చేశారు. ఆ సమయంలోనే ఆయన రాజకీయాలు రాటుదేలాయి. వామపక్షాలకు చెందిన విద్యార్ధి సంఘాలతో నిరంతరం సంఘర్షిస్తూనే ఏబీవీపీలోకి విద్యార్ధులను ఎలా రాబట్టాలో, వారిలో హిందూ భావాలను ఎలా ప్రోది చేయాలో నరేంద్ర మోదీ చాలా ఆకళింపు చేసుకున్నారు. ఇదే ఆయన జీవితంలో మేలి మలుపు తీసుకుంది.
ఏబీవీపీలో ఉండగానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రముఖుల కళ్లలో పడిన నరేంద్ర మోడీ 1985లో ఆర్ఎస్ఎస్ సూచనల మేరకు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక అక్కడి నుంచి నరేంద్ర మోదీ ప్రతిభ అప్రతిహతంగా వెలుగుతూనే ఉంది. గుజరాత్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పార్టీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రను దగ్గరుండి నడింపించారు. అలాగే పార్టీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషీ చేపట్టిన కన్యాకుమారి – కాశ్మీర్ రథయాత్ర కూడా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే నడిచింది.
కేశూ భాయ్ నుంచి పగ్గాలు
గుజరాత్ లో సంభవించిన భూకంపం ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేశూభాయ్ పటేల్ బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. ఆ సమయంలో పార్టీని చక్కబెట్టేందుకు నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిని చేసింది పార్టీ. అక్కడి నుంచి నాలుగుసార్లు గుజరాత్ లో మోడీ హవా నడిచింది. ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నరేంద్ర మోడీని మరో చీకటి కోణం వేధించింది. అదే గుజరాత్ అల్లర్లు. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు ఎదుర్కొన్న నరేంద్ర మోడీ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికలలో తన రాజకీయ చతురతతో అద్భుత విజయం సాధించిన నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీ తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించింది. ఛాయ్ వాలా భారత్ ప్రధాని… ఇదిబీజేపీకే సాధ్యం అంటూ సంబురాలు చేసుకున్నారు.
మొదటి సారి ఓకే… రెండోసారే ఇబ్బందులు…
భారత ప్రధానిగా తొలి ఐదేళ్లు నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు అటు పార్టీని, ఇటు దేశ ప్రజలను అంగీకరించేలా చేశాయి. అయితే తొలిసారి చివరి ఏడాదిన్నర నరేంద్ర మోడీకి గడ్డుకాలంగానే గడించింది. పార్టీలో కొందరు ఈసారి ఎన్నికలలో తమకు తక్కువ స్ధానాలు వస్తాయంటూ ప్రచారం చేశారు. ఒక దశలో ప్రధానిగా సీనియర్ నాయకులను తెర పైకి తీసుకువచ్చారు. అయితే, పార్టీ అధ్యక్షుడు, తన స్నేహితుడు అమిత్ షాతో కలిపి నెరపిన రాజకీయ చతురత తిరిగి భారతీయ జనతా పార్టీకి అప్రతిహత విజయాన్ని అందించింది. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు వెంకయ్య నాయుడు వంటి వారిని కావాలనే పక్కన పెట్టారనే నిందలూ పడ్డారు. అయినా తాను అనుకున్నది సాధించే మనస్తతత్వమున్న నరేంద్ర మోడీ ఎలాంటి విమర్శలను లెక్క చేయకుండా ముందుకు నడుస్తున్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అంటే భారతీయ జనతా పార్టీ అన్న చందంగా మారిపోయింది. రాజకీయ పోరాటంలో అలుపెరగని యోధునిలా పోరాడుతున్న నరేంద్ర మోడీకి లియో న్యూస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.