కన్నె మనసులు దోచే కేడి.. మగువలకు మన్మథుడు.. సరసాల సోగ్గాడు.. మాస్ ప్రేక్షకులకు కింగ్ … రొమాంటిక్ మజ్ను.. యాక్షన్ శివ .. అక్కినేని నాగార్జున కాక ఇంకెవరు? మనసు 20లో విహరిస్తుంటే.. వయసు అరవైల్లో దోబూచులాడుతోంది. అదే ఆయన ప్రత్యేకత. నాటి విక్రమ్ నుంచి నేటి దేవదాస్ వరకూ.. అదే గ్లామర్ ను మెయిన్ టెయిన్ చేస్తూ.. చిరునవ్వే తన ఆరోగ్య రహస్యమన్న పరమ సత్యాన్ని బోధిస్తున్నారు. నటుడిగా రాటుతేలి, నిర్మాతగా నిలదొక్కుకొని.. టెవివిజన్ హోస్ట్ గా దూసుకుపోతున్నారు మన బిగ్ బాస్.
అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా .. ‘సుడిగుండాలు, వెలుగునీడలు’ చిత్రాల్లో చిన్ననాడే నటుడిగా వెండితెరమీద మెరిశారు నాగార్జున. ఆపై విక్రమ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలిచిత్రంతోనే అభిమాన గణాన్ని సంపాదించుకొని.. ‘మజ్ను’ తో అమ్మాయిల కలల రాకుమారుడయ్యారు. ఆ తర్వాత ‘సంకీర్తన, ఆఖరిపోరాటం, జానకి రాముడు గీతాంజలి’ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ఇక ‘శివ’ చిత్రం నాగార్జున నటజీవితంలోనే మైలు రాయిగా నిలిచిపోయింది. ఆ సినిమాతో మాస్ జనంలో ఆయన ఇమేజ్ తారాస్థాయికి చేరింది.
ఆ తర్వాత కొన్ని సినిమాలు నిరాశపరిచినా.. ‘కిల్లర్ , నిర్ణయం’ సినిమాలతో తిరిగి సక్సెస్ అందుకుని తండ్రి పేరు నిలబెట్టారు. ముందు నుంచీ కొత్త దర్శకులతో ప్రయోగం చేయడం నాగార్జున ప్రత్యేకత. ఆ క్రమంలో ఎందరో దర్శకులకు టాలీవుడ్ లో నిలదొక్కుకొనే అవకాశం కల్పించారు. ఇటు మాస్ చిత్రాల్లోనూ, అటు రొమాంటిక్ లవ్ స్టోరీస్ లోనూ నాగార్జున నటించి మెప్పించారు. అంతేకాదు.. ‘అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి, ఓం నమో వేంకటేశాయ’ లాంటి భక్తి రస చిత్రాలతోనూ.. అలరించి.. ఆల్ రౌండర్ అయ్యారు.
కేవలం.. వెండి తెర కే పరిమితం కాకుండా బుల్లి తెర ని కూడా నాగ్ ప్రభావితం చేశారు. ‘యువ’ అనే సీరియల్‌తో బుల్లితెరపై నిర్మాతగా అడుగుపెట్టారు నాగ్. మా టీవీని స్టార్ నెట్‌వర్కకు విక్రయించే ముందు నాగార్జున ఆ ఛానల్‌కు ప్రధాన వాటాదారుడిగా ఉండేవారు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తెలుగు వెర్షన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కు నాగార్జున హోస్ట్ చేశారు. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ సీజన్ 4కు హోస్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు .
ఎన్నో వాణిజ్య ప్రకటనలకు అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్నారు నాగార్జున. 2012 సంవత్సరంలో 36 వ స్థానంలోనూ, 2013 సంవత్సరంలో 43వ స్థానంలోనూ ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో ఉన్నారు నాగార్జున. ఇలా అన్నిరంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన నాగార్జున.. పుట్టిన రోజు నేడు. ఈ సంద్భంగా అక్కినేని మన్మథుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది ది లియోన్యూస్ .కామ్. హ్యాపీ బర్త్ డే నాగార్జున..