దర్శకుడు హరీష్ శంకర్ కు మెగా కాంపౌండ్ తో అవినాభావ సంబంధం ఉంది. తన కెరీర్ లో ఎక్కువగా
మెగా హీరోలతోనే సినిమాలు చేశాడు ఈ దర్శకుడు. అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. ఇలా ఎక్కువ మంది మెగా హీరోలతోనే తన కెరీర్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు ఈ దర్శకుడు. త్వరలోనే పవన్ కల్యాణ్ తో కలిసి మరో సినిమా కూడా చేయబోతున్నాడు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడీ దర్శకుడు మెగా కాంపౌండ్ లో మరో కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నాడు.
గీతాఆర్ట్స్ బ్యానర్ లో సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు హరీష్ శంకర్. గీతాఆర్ట్స్ బ్యానర్ పై త్వరలోనే ఓటీటీ డ్రామా ఒకటి రాబోతోంది. అది వెబ్ సిరీసా లేక ఒరిజినల్ సినిమానా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్టును గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై నిర్మిస్తారా లేక మరో కొత్త బ్యానర్ పెడతారా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్.
ఈ సంగతి పక్కనపెడితే.. గీతా బ్యానర్ పై రాబోతున్న ఈ ఓటీటీ ప్రాజెక్టుకు హరీశ్ శంకర్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. ఈ ప్రాజెక్టులో చాలా మెరుపులున్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు దశరథ్ ఈ సినిమాకు కథ అందించాడు. ఆ కథకు హరీశ్ శంకర్ తనదైన డైలాగ్స్, కొన్ని ఎపిసోడ్స్ అందించినట్టు తెలుస్తోంది. అందుకే అతడ్ని మధ్యేమార్గంగా సమర్పకుడిగా మార్చినట్టున్నారు. ఇక ఈ ప్రాజెక్టుతో ఓ కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.
కొసమెరుపు ఏంటంటే.. హరీశ్ శంకర్ ఇంతమంది మెగా హీరోలతో వర్క్ చేసినప్పటికీ, దర్శకుడిగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇన్నాళ్లకు ఈ బ్యానర్ పై ప్రజెంటర్ అవతారం ఎత్తబోతున్నాడు ఈ డైరక్టర్. ఈమధ్య చాలామంది దర్శకులు ఇలా అంతా తామే చేస్తున్నప్పటికీ తమ పేరు మాత్రం వేయించుకోవడం లేదు. ఉదాహరణకు మారుతినే తీసుకుంటే, త్వరలోనే చేయబోతున్న ఓ ఓటీటీ మూవీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు ఈ దర్శకుడు. కానీ పేరు మాత్రం వేరే వ్యక్తులది. ప్రస్తుతం గోపీచంద్ తో ఓ సినిమా చేయడమే దీనికి కారణం. అంతెందుకు.. రీసెంట్ గా రిలీజైన ఏక్ మినీ కథ విషయంలో కూడా ఇదే జరిగింది.
ఈ ప్రాజెక్టు మేర్లపాక గాంథీ ది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అతడివే. దాదాపు దర్శకత్వం పర్యవేక్షణ కూడా చేశాడు. కానీ దర్శకుడిగా మరో వ్యక్తి పేరు పడింది. దీనికి కారణం నితిన్ తో మేర్లపాక సినిమా సెట్స్ పై ఉండడమే. ఇప్పుడు హరీష్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. పవన్ తో సినిమా చేయబోతున్న ఈ దర్శకుడు.. ఓటీటీ ప్రాజెక్టుకు చాలా సహకారం అందిస్తున్నప్పటికీ, కేవలం సమర్పణ అనే నేమ్ కార్డ్ కే పరిమితమైపోతున్నాడు.
Must Read ;- మరోసారి పవర్ స్టార్ సరసన సామ్ ?











