పులివెందులలో వై.ఎస్.ఫ్యామిలీ క్రేజ్ తగ్గిపోయిందా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వైసీపీ తరపున పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా జగన్ తన బాబాయి వై.ఎస్.మనోహర్ రెడ్డి సతీమణి ప్రమీలమ్మను ప్రకటించారు. ఐతే ప్రచారంలో ప్రమీలమ్మ, ఆమె భర్త మనోహర్ రెడ్డి చుట్టూ బౌన్సర్లను పెట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సొంత నియోజకవర్గంలోనే ప్రజల మధ్య తిరగడానికి బౌన్సర్లు అవసరం పడ్డాయంటే, అక్కడ వైఎస్ కుటుంబం పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధం చేసుకోవచ్చంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
కడప జిల్లాను తమ కంచుకోటగా చెప్పుకునే వైఎస్ ఫ్యామిలీ..ఇవాళ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికే భయపడి సెక్యూరిటీని ఆశ్రయించడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేత బీటెక్ రవి ఎద్దెవా చేశారు. పులివెందుల ప్రజలే తమ వెన్నంటే ఉన్నారని చెప్పుకునే వారు, ఇప్పుడు జనంలో తిరగలేక బౌన్సర్లను పెట్టుకుని తిరుగుతుండటం వారి నైతిక పతనానికి నిదర్శనమని స్పష్టం చేశారు. ఇప్పటికే పులివెందులలో ప్రజలు వైఎస్ కుటుంబ తీరును గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కూటమి మిత్రులు ఎక్కడ పోటీ చేసినా బంపర్ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే భయం జగన్‌ను, ఆ పార్టీ నేతలను వెంటాడుతోందంటున్నారు టీడీపీ నేతలు. పులివెందులలోనే ఈ తరహాలో ప్రచారం చేసుకునే పరిస్థితి రావడం వైఎస్ ఫ్యామిలీ దుస్థితికి అద్దం పడుతోందన్నారు బీటెక్ రవి.ఎన్నికలకు ముందే వారు ఓటమిని అంగీకరించినట్లయిందని ఎగతాళి చేశారు.
మొత్తానికి, పులివెందుల మున్సిపల్ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సొంత గడ్డపైనే బౌన్సర్లతో ప్రచారం నిర్వహించాల్సిన దుస్థితి వైఎస్ కుటుంబానికి రావడంతో, స్థానిక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయని స్పష్టమవుతోంది. ఈ పరిణామాలు రాబోయే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మరింత కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.











