ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘానికి నిధుల విడుదలపై ప్రభుత్వం సహకరించడంలేదని నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించడంలేదన్న హైకోర్టు తప్పు పట్టింది.
తొలినుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు జగన్ ప్రభుత్వానికి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతూనే ఉంది. జగన్ ఇష్టానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను ప్రకటించడమూ.. ఆ తరువాత.. జగన్ ఇష్టానికి వ్యతిరేకంగానే వాయిదా వేయడమూ కూడా జరిగిపోయాయి.
ఇదంతా మనసులో పెట్టుకున్న ప్రభుత్వం.. నిమ్మగడ్డ పదవీకాలాన్ని కుదించి.. కొత్త కమిషనర్ గా జస్టిస్ కనగరాజ్ ను తెచ్చింది. నిమ్మగడ్డ సుప్రీం కోర్టుకు వెళ్లి.. తన నియామకం పదవి వయసు కుదించడం సాధ్యం కాదని తీర్పు వచ్చాక తిరిగి నియమితులయ్యారు.
అప్పటినుంచి నిమ్మగడ్డకు, ప్రభుత్వానికి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తోంది. నిమ్మగడ్డ అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోడానికి సమావేశం నిర్వహిస్తే వైసీపీ గైర్హాజరైంది. ఎన్నికల నిర్వహణ గురించి అభిప్రాయం అడిగితే.. ఇప్పట్లో నిర్వహించలేం అని సీఎస్ ద్వారా ప్రభుత్వ సమాధానం వెళ్లింది. ఇలాంటి నేపథ్యంలో ఈసీ పనికి ప్రభుత్వం సహకరించడం లేదని నిమ్మగడ్డ హైకోర్టులో కేసు వేశారు.
దీనిపై విచారించిన హైకోర్టు, ఈసీ ఇచ్చిన వినతులపై ప్రభుత్వం స్పందించకుండా బాధ్యతారాహి త్యంగా వ్యవహరిస్తోందని పేర్కొంది.
తాము తొలగించిన వ్యక్తి తిరిగి ఈసీగా రావటంతో ప్రభుత్వం నాన్ కో ఆపరేటింగ్ గా వ్యవహరిస్తోందని న్యాయ స్థానం పేర్కొంది. దీనిని తప్పు పట్టింది. ప్రభుత్వాలు మారుతాయి తప్ప రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ ఉంటాయన్న హైకోర్టు వ్యాఖ్యలు కీలకంగా కనిపిస్తున్నాయి. రాజ్యాంగ బద్ధ సంస్థలను కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఎన్నికల సంఘం 3 రోజుల్లోగా ప్రభుత్వానికి సవివర వినతి పత్రం సమర్పించాలని ఆదేశించింది.
ప్రభుత్వం దీన్ని పరిశీలించి ప్రభుత్వం ఏం చేసిందో నివేదిక రూపంలో 15 రోజుల్లోగా హైకోర్టుకి సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
కనగరాజ్ లాయర్ ఫీజులపై ఘాటు వ్యాఖ్యలు
మాజీ జస్టిస్ కనగరాజ్ ఫీజు చెల్లింపుల విషయంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కనగరాజ్ తన పదవికి సంబంధించి అద్వకేట్ ను నియమించుకుంటే ఆయనే న్యాయవాదికి సొంత చెల్లింపులు చేసుకోవాలని పేర్కొంది. కనగరాజ్ ఇంటి కోసం 20 లక్షలు, ఫర్నిచర్ కోసం కేటాయించిన 15 లక్షలు ఇవ్వాలా వద్దా అనేది ఈసీ మరోసారి పరిశీలించాలని హైకోర్టు సూచించింది. కనగరాజ్ న్యాయవాది కోసం పెట్టిన ఖర్చు వివరాలు ప్రజలకు తెలియాలని, ఇదంతా ప్రజలకు చెందిన సొమ్మన్న హైకోర్టు వ్యాఖ్యానించడం విశేషం.
జగన్ కు దెబ్బే
హైకోర్టు తీర్పు జగన్ సర్కారుకు గొంతులో పచ్చివెలక్కాయ లాంటిదేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈసీకి సహకరించడం అనేది.. ప్రభుత్వానికి ఇష్టంలేని వ్యవహారం. ఈసీ మాత్రం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.