(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం అనువంశిక ధర్మకర్తగా పూసపాటి వంశీయుడు, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజునే కొనసాగిస్తూ రాష్ట్ర హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రామతీర్థంలోని కోదండరాముని శిరస్సును ఖండించడాన్ని బాధ్యడును చేస్తూ .. అప్పటికి అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోకగజపతిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఈ విషయంపై అశోకగజపతి హైకోర్టును ఆశ్రయించారు.ఈ విషయంపై సమగ్ర విచారణ జరపిన రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది.
శ్రీరామచంద్రుడే నన్ను ఆశీర్వదించారు : అశోక్
“రామతీర్ధాలు అనువంశిక ధర్మకర్తగా నన్ను తొలగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్ట్ వారు ఈ రోజు కొట్టివేయడం జరిగింది. ఈ రోజు రామతీర్ధాలులో విగ్రహ ప్రతిష్ట అని టీ.వి. వార్తల ద్వారా తెలిసింది. ఈ శుభదినాన ఆ శ్రీ రామచంద్రుడే నన్ను ఆశీర్వదించి ఆయనకు సేవ చేసుకొనే భాగ్యాన్ని మళ్ళీ కలిగించారు అని భావిస్తున్నాను.
-మీడియాతో అశోక్ గజపతిరాజు
అయినా అశోక్ ఏమి చేశారని : వెల్లంపల్లి
“కోర్టు ఉత్తర్వులను పరిశీలించాల్సివుంది.. అయినా రామతీర్థం అనువంశిక ధర్మకర్తగా అశోకగజపతి ఏమి చేశారని?, రామతీర్థం ఆయన ఎన్నిసార్లు వెళ్లారని?, ఆలయం అభివృద్ధికి ఏవిధంగా కృషి చేశారని?” రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. “రామతీర్థం అనువంశిక ధర్మకర్తగా అశోకగజపతిని తొలగించడం – హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టివేయడం” నేపథ్యంలో విజయనగరంలో మీడియా వెల్లంపల్లిని ప్రశ్నించగా ఆయన బదులిచ్చారు. ఆయన తొలగింపును సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
దోషులను పట్టుకుంటాం : వెల్లంపల్లి
రామతీర్థం ఘటనకు బాధ్యులైన దోషులను పట్టుకుంటామని.. కోర్టుముందు నిలబెడతామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. రామతీర్థం వ్యవహారంలో దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
కోటబొమ్మాళి వ్యవహారంలానే ..
కోటబొమ్మాళి వ్యవహారంలో తెలుగుదేశం నాయకుల పాత్ర బయటపడినట్లే .. రామతీర్థం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు అండ్ కో వ్యవహారం బయటపడుతుందని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సుస్పష్టం చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపైన, దేవతామూర్తులపైన దాడులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు.
Must Read ;- జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’











