కాట్రగడ్డ నరసయ్య… సినిమా ప్రపంచానికి శాశ్వతంగా దూరమైపోయిన పేరిది. తొమ్మిది పదుల వయసున్న నరసయ్య విజయవాడలో ఈరోజు కన్నుమూశారు. ఇంతకీ ఎవరీ నరసయ్య అంటే చెప్పటానికి చాలానే ఉంటుంది. సినిమానే శ్వాసగా, ధ్యాసగా భావించేవారు అతికొద్దిమందే ఉంటారు. ఆ కొద్ది మందిలో అగ్రస్థానం నరసయ్యదే అవుతుంది. ప్రముఖ చలన చిత్ర పంపిణీ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్ గా, జనరల్ మేనేజర్ గా ఒకప్పుడు ఆయన బాధ్యతలు చూసేవారు. ఏ సినిమాని ఎలా మార్కెంటింగ్ చేయవచ్చో ఆయనకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు. ఒకవిధంగా నడిచే సినిమా ఎన్ సైక్లోపీడియా నరసయ్య. ఆయన స్లోగన్స్ చూసి మంచి రాతగాడు అని అందరూ కొనియాడేవారు.
‘చెంచులక్ష్మి’ సినిమాలో సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచిన ‘చెట్టు లెక్కగలవా ఓ నరహరిపుట్టలెక్కగలవా…’ పాట విని చెక్కబీరువాలను కూడా చిగురింపజేసే గొప్ప పాట అని కితాబిచ్చారు. అలాగే ‘నమ్మినబంటు’ సినిమా గురించి రాస్తూ మేటి నటులకన్నా మిన్నగా నటించిన ఎద్దులు అనే స్లోగాన్ పేల్చారు. ఏదో ఫిలిం ఫెస్టివల్ కు నటులు వెళ్లనంటే ‘ఎద్దుల్ని పంపేయండి’ అని సలహా ఇచ్చారట కాట్రగడ్డవారు. ఆయన కామెంటు ఎంత ఇష్టమో అవంటే అంత భయం కూడా అని దుక్కిపాటి మధుసూదనరావు లాంటి నిర్మాతలు అన్నారంటే తెలుస్తోంది ఆయన ఘనత. ఒకసారి ‘వెలుగునీడలు’ వెండి తెర నవల చదివి ఇడ్లీకన్నా పచ్చడి బాగుంది అనేశారట. అంటే సినిమా కన్నా కొసరుగా వచ్చిన నవలే బాగుందన్నది కాట్రగడ్డవారి ఉద్దేశం.
నవయుగ చేతిలో సినిమా పడితే చాలు…
థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఎలా అనే పుస్తకం రాయాలంటే అది కాట్రగడ్డ నరసయ్యవల్లే సాధ్యం అనేవారు. ఆరోజుల్లో నవయుగ సంస్థ చేతిలో సినిమా పెడితే చాలు గుండెల మీద చెయ్యేసుకుని పడుకోవచ్చు అనేవారు నిర్మాతలు. ఎన్టీఆర్, ఏయన్నార్, డి. రామానాయుడు లాంటి దిగ్గజాలు సైతం కాట్రగడ్డ వారి బుర్రలో ఉన్న ఐడియాల మీద ఆధారపడేవారంటారు. సినిమా గురించి ఆయన ఏమంటారో ఆయన మాటల్లోనే చూద్దాం…‘అసలు సినిమా అనేది జనాలకు చేరాలంటే.. అందుకుతగ్గ ప్రచారం చాలా ముఖ్యం. అప్పటిదాకా అనుసరించే పాత విధానాల్ని పక్కనపెట్టి.. కొత్తగా ప్రచారం చేయాలనే ఆలోచన చేసేవాడిని. అలా ప్రయత్నం చేయడం వల్లే పబ్లిసిటీ రంగంలో తొందరగా నాకో ప్రత్యేకత, నాకంటూ ఓ ముద్ర ఏర్పడింది.
”నరసయ్యగారు వచ్చాక సినిమా పబ్లిసిటీలో రోజులు మారాయండీ!” అని సరదాగా అనేవారంతా. ‘రోజులు మారాయి’ సినిమాకు నేను అనుసరించిన పద్ధతులు అలా పేరు తీసుకొచ్చాయి. విప్లవం, అభ్యుదయం, సమసమాజ స్థాపన లాంటి ఆలోచనలతో సారథి స్టూడియోవారు తీసిన సినిమా ఇది. ఈ సినిమా నుంచే సినిమావాళ్ళ దృష్టిలో పడ్డా. ‘రోజులు మారాయి’ సినిమాలో వహీదా రెహమాన్‌ది నర్తకి పాత్ర. ‘ఏరువాక సాగారో’ అంటూ ఆమె నటించిన పాటను మాత్రమే పబ్లిసిటీలో బాగా వాడాను. టేప్‌రికార్డర్‌లో రికార్డ్ చేసి.. రిక్షా, వ్యానుల్లో ఆ పాట వేస్తూ ఊరూ వాడా తిప్పేవాళ్ళం. కేవలం ఆ పాట చూడ్డం కోసమే అన్నట్లు ఆ సినిమాకు జనాలు తండోప తండాలుగా వచ్చేవారు. సినిమా 25 వారాలు ఆడింది. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు నా ప్రచార పద్ధతి బాగా నచ్చింది’ అని వివరించారు.
ఆ రోజులు వేరాయె…
‘రోజులు మారాయి సినిమాను విజయవాడ కనదుర్గమ్మ కూడా చూసిందని జనం అనేవారు. అది పబ్లిసిటీ ప్రయోగమనీ.. అది తన ఎత్తుగడేనని, తాను స్వయంగా చెబితేగానీ ఎవరికీ తెలియలేదన్నారు. ఇదంతా ఎందుకంటే.. జనాల్ని నమ్మించి, ఏదో చెయ్యడం కాదు, సినిమాపై ఆసక్తి కలిగించడానికి ఆకర్షణీయమైన ప్రచారం చెయ్యాలనేది తన సంకల్పం అనేవారు. ఎందుకంటే ఒక సినిమాను నమ్ముకుని, వేలాది కార్మికుల జీవితాలు ఆధారపడి ఉంటాయనేది ఆయన అభిప్రాయం. సినిమాని కాపాడాలనే అభిప్రాయంలో ఆయన ఉండేవారు. కానీ ఈరోజు సినిమా విడుదలైతే చాలు విమర్శ పేరుతో దాన్ని చీల్చిచెండాడటానికి కంకణం కట్టుకుకూర్చునేవారు చాలామందే ఉన్నారు.
‘వాణిశ్రీ నటించిన సినిమాలైతే.. ఆవిడకుండే స్పెషాలిటీని.. అంటే జడకొప్పుల్ని హైలెట్ చేసి, ప్రచారం చేసేవాళ్ళం. చలం, జమున హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘బంట్రోతు భార్య’ సినిమాలో మొబైల్ లాండ్రీ సన్నివేశం ఉంటుంది. అందుకే ప్రచారంలో భాగంగా మొబైల్ లాండ్రీలను తయారుచేయించి.. పేదవాళ్ళకు ఉచితంగా పంచిపెట్టాం. ‘అంతులేని కథ’ సినిమాలో మిమిక్రీ ప్రదర్శించే క్యారెక్టర్ ఉంటుంది. దీంతో రాష్ట్రంలోని మిమిక్రీ కళపట్ల ఆసక్తి ఉన్న కుర్రాళ్ళను పిలిపించి శిక్షణ ఇప్పించాం. వారితో అలంకార్ థియేటర్లో సినిమాలోని ఆ మిమిక్రీ సన్నివేశాల్ని ప్రదర్శింపజేశాం. దాంతో సినిమాకు కావాల్సినంత ప్రచారం లభించింది’ అని వివరించారాయన.
అనామక పాత్రలకూ పోస్టర్ లో స్థానం
సినిమాలోని హీరో, హీరోయిన్లే కాదు.. ఆ సినిమాలో ఆసక్తిగొలిపే క్యారెక్టర్ ఉంటే.. దాన్ని పోస్టర్ మీదకు తెచ్చి.. ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచేవారాయన. ఎన్టీఆర్ నటించిన ‘నర్తనశాల’ సినిమా పోస్టర్ విషయంలో అలాగే చేశారు. ఎన్టీఆర్ చాలా పెద్దనటుడు.. పోస్టర్‌లో ఆయనుంటే చాలు. కానీ ఆ సినిమాలోని అన్నిపాత్రల్నీ పోస్టర్ మీద వేసి, కొత్తగా చూపించారు. దీనికి ఎన్టీఆర్ కూడా ఇబ్బంది పడలేదట. పైగా ”ఏం నరసయ్యగారూ..! పిక్చర్ బాగా ఉంది. మీ పోస్టరు ఇంకా బాగా ఉంది..!!” అని స్వయంగా భుజం తట్టి మెచ్చుకున్నారట.
థియేటర్ల ఆధునికీకరణ దృష్టీ ఆనాడే
సినిమా థియేటర్లు సాంకేతికంగా మార్పులు చెందాలని భావించేవారాయన. థియేటర్ల ఆధునికీకరణకు ఆయన కంకణం కట్టుకునేవారు. మార్పులు, చేర్పుల విషయంలో థియేటర్ యాజమాన్యానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సూచనలు, సలహాలు ఇస్తుండేవారు. విజయవాడలో అనేక కొత్త థియేటర్లు రావడంతో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బాగా పెరిగింది. మద్రాసు కేంద్రంగా ఉండే ప్రచార, ముద్రణ వ్యవస్థలన్నీ విజయవాడలోనూ అభివృద్ధిచెందాయి.
నవయుగలో 30 ఏళ్లు ఉద్యోగం, ఆ తర్వాత విజయవాడ ఫిల్మ్ ఛాంబర్లో సెక్రటరీగా కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఫిల్మ్ జర్నల్’ మంత్లీకి ఎడిటర్‌గా చేశారు. విజయవాడలో కల్యాణ మండపాల నిర్మాణ సంస్కృతికి శ్రీకారం చుట్టింది కూడా ఆయనే. తెలుగు సినిమా రంగం నరసయ్యను మరచిపోయినా ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవల్ని తెలిసినవారు ఎవరూ మరువలేరు.